Taylor Swift AI Pictures : అమెరికాలో డీప్‌ఫేక్ కలకలం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్‌ను డీప్‌ఫేక్ సెగ తాకింది. బైడెన్ వాయిస్ అనుకరిస్తూ చేసిన ఏఐ-జనరేటెడ్ ఫోన్‌కాల్స్, గాయనికి చెందిన అభ్యంతరకర దృశ్యాలపై వైట్‌హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. సమస్య పరిష్కారానికి తాము చేయాల్సినవన్నీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే, దీనిని కట్టడి చేసే విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలదే కీలక పాత్ర అని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ పేర్కొన్నారు.
కాగా, ఎక్స్(ట్విట్టర్)లో టేలర్ స్విఫ్ట్‌కు సంబంధించిన అభ్యంతరకర ఏఐ చిత్రాలు చక్కర్లు కొట్టాయి. అలాంటి చిత్రాలకు వ్యతిరేకంగా ట్విట్టర్లో నిబంధనలు ఉన్నప్పటికీ ఆ దృశ్యాలను తొలగించలేకపోయారు. 17 గంటల పాటు అవి ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. 4.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ అసభ్య చిత్రాలపై టేలర్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
బైడెన్ ఏఐ కాల్స్!
ఈ ఏడాది చివర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం అమెరికాలోని రాష్ట్రాల్లో ప్రైమరీ పోల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత వారం న్యూ హాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా బైడెన్ ఏఐ ఫోన్‌కాల్స్ హల్చల్ చేశాయి. బైడెన్ చెప్పినట్టుగా ముందుగా రికార్డు చేసిన ఫోన్ కాల్స్ న్యూ హాంప్‌షైర్ ఓటర్లకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేయవద్దని బైడెన్ కోరుతున్నట్లు ఆ వాయిస్ కాల్స్ రికార్డు చేశారు. ఈ ఏఐ జనరేటెడ్ ఫోన్ కాల్స్‌పై ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికాలో ఇలా ఏఐ దుర్వినియోగం అవుతుండటం అభ్యర్థులకు కలవరపాటుగా మారింది. బైడెన్ వాయిస్‌ను అనుకరిస్తూ కాల్స్ చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక, సచిన్ ఏఐ వీడియోలు కలకలం
భారత్‌లోనూ ఇటీవల సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం రేపాయి. రష్మిక మంధాన్న అభ్యంతరకరమైన వీడియోలు, సచిన్ తెందూల్కర్ వంటి ప్రముఖుల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన కేంద్రం- సామాజిక మాధ్యమ సంస్థలతో సమావేశమైంది. ఇలాంటి ఏఐ డీప్‌ఫేక్‌ల కట్టడికి త్వరలోనే చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించింది.
డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించాలా? ఈ సింపుల్ టెక్నిక్స్ వాడండిలా!