Syrian Rebels Freed Saydnaya Prisoners : సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతం తర్వాత, ఆయన ఆకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అందులో సైద్నాయ జైలు ఒకటి. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఉక్కుపాదం అణదొక్కేందుకు, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రత్యక్ష నరకం అది. సిరియా వధశాలగా అభివర్ణించే ఆ జైల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. తాజాగా తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించిన నేపథ్యంలో ఏళ్లతరబడి అదృశ్యమైన తమ వారి జాడ కోసం పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు సైద్నాయ జైలు వద్దకు చేరుకుంటున్నారు. తమవారి ఆచూకీ దొరక్క కన్నీరుమున్నీరు అవుతున్నారు.
అది జైలు కాదు - ప్రత్యక్ష నరకం
అది జైలు కాదు, అక్కడి ఖైదీలకు అదోక ప్రత్యక్ష నరకం. అందులోకి వెళ్లామంటే తిరిగి ప్రాణాలతో బయటపడడమనేది అసాధ్యం. అక్కడి ఉండే ఖైదీలకు చావడమే మేలు అనే అంతలా చిత్రహింసలకు గురి చేసి నరకం చూపించేవారు. ఈ జైలే సిరియా రాజధాని డమాస్కస్ శివార్లులో సైద్నాయ జైలు. తిరుగుబాటుదారుల విజయంతో దేశాన్ని విడిచి పారిపోయిన బషర్ అల్ అసద్ పాలన సమయంలో ప్రభుత్వ వ్యతిరేకుల కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న జైలు అది. తనకు ఎదురుతిరిగిన వారిని అసద్ అరెస్టు చేయించి సైద్నాయ జైల్లో బంధించేవారు. సిరియా వధశాల పేరొందిన ఆ జైల్లో ఖైదీలకు కరెంట్ షాక్‌లు ఇవ్వడం, చేతి గోళ్లు కట్ చేయడం సహా పలు రకాలుగా చిత్ర హింసలకు గురి చేసేవారు. ఖైదీలపై అత్యాచారాలు, హత్యలు వంటివి ఆ జైల్లో సర్వసాధారణంగా జరిగేవని చెబుతున్నారు. తాజాగా హయాత్ తహరీర్ అల్-షామ్-హెచ్‌టీఎస్ ఇతర తిరుగుబాటు గ్రూపులతో కలిసి సిరియాను ఆక్రమించుకున్నారు. దీనితో అసద్‌ల పాలన అంతమైంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న పలు కారాగారాల్లోని బందీలను విడుదల చేశారు. దీంతో ఏళ్లతరబడి అదృశ్యమైన తమ వారి జాడ కోసం పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు సైద్నాయ జైలు వద్దకు చేరుకుంటున్నారు.
సామూహిక హత్యలు!
2011లో ప్రభుత్వంపై ఉద్యమం మొదలైన నాటి నుంచి తమను ఎవరు వ్యతిరేకించినా అసద్ ప్రభుత్వం వారిని ‘సైద్నాయ’కు తరలించేది. 2017లో అమ్నెస్టి ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం నాడు 10 వేల నుంచి 20 వేల మంది ఆ జైల్లో ఉన్నట్లు అంచనా. వారందరినీ అంతం చేయడానికే అక్కడికి తీసుకొచ్చారని పేర్కొంది. తరచూ వేల మందిని సామూహికంగా హత్య చేసేవారని వెల్లడించింది. ఇక ఖైదీలను చిత్రహింసలకు గురిచేయడం ఆ జైల్లో నిత్యకృత్యం. గాయాలు, వ్యాధులు, ఆకలితో రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను తీసుకెళ్లడానికి గార్డులు రౌండ్స్‌కు వచ్చేవారు. ఈ నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు మానసిక వ్యాకులతకు లోనై ఆహారం మానేసి ప్రాణాలు వదిలేసేవారు. సోదరులను కోల్పోని మహిళ సిరియాలో లేదంటే అతిశయోక్తి కాదు అని ఇస్మాయిల్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. అతడి ఇద్దరి పిల్లలను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.
2011 నాటి నుంచి సిరియాలో అరెస్టు లేదా జాడ తెలియకుండా పోయినవారి సంఖ్య 1,50,000. వీరిలో వేలమంది ‘సైద్నాయ’లోనే తమ చివరి రోజులు గడిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జైలు వద్దకు వచ్చిన ప్రజలకు సాయం చేసేందుకు ఐదు వైట్ హెల్మెట్, రెండు జాగిలాల బృందాలు చేరుకొన్నాయి. డమాస్కస్ రెబల్స్ చేతిలోకి వెళ్లడానికి మూడు నెలల ముందు వరకు ఇక్కడ 3,500 మంది ఉన్నట్లు అంచనా. 2021లో యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనాల ప్రకారం ఈ జైళ్లలో కనీసం లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు.
పౌర కారాగారంలోకి మారుస్తున్నామంటూ - హత్యలు!
సైద్నాయ మిలిటరీ జైల్లో ‘వై’ ఆకరాంలో ఎర్ర రంగు భవనాలు ఉన్నాయి. ఇక్కడికి తీసుకొచ్చి హతమార్చడానికి ముందు బాధితులకు డమాస్కస్ శివార్లలోని అల్-ఖ్వబౌన్ మిలిటరీ ఫీల్డ్ కోర్టులో శిక్షలు విధించేవారు. ఈ ప్రక్రియ ఒకటి నుంచి మూడు నిమిషాల్లో ముగిసిపోయేది. అదేరోజు వారిని జైలుకు తరలించి ఉరితీసేవారు. దానిని వారు పార్టీగా అభివర్ణించేవారు. ఇందులోభాగంగా వారిని తొలుత జైల్‌లోని గదుల నుంచి బయటకు తీసుకొస్తారు. పౌర జైళ్లకు తరలిస్తున్నట్లు బాధితులకు అబద్ధం చెప్పేవారు. ఆ తర్వాత ఎర్ర రంగు భవనాల్లోని భూగర్భ గదుల్లోకి తరలించేవారు. అక్కడ రెండు నుంచి మూడు గంటలపాటు వారిని చిత్రహింసలకు గురిచేయడం సర్వసాధారణం. ఇక అర్ధరాత్రి కాగానే వారి కళ్లకు గంతలు కట్టి మినీ బస్ లేదా ట్రక్కులో ఒక తెల్లటి భవనానికి తరలిస్తారు. అక్కడి భూగర్భ గృహంలో ఉరి తీసేవారట.
ఈ ప్రక్రియను ఆ జైలు అధికారులు ప్రతి వారం లేదా రెండు వారాలకోసారి నిర్వహించడం పరిపాటిగా మారిందని అమ్నెస్టి నివేదిక పేర్కొంది. హత్యకు గురయ్యేవరకు బాధితుల కళ్లకు గంతలు తొలగించేవారు కాదు. ఉరి తీయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే వారికి మరణశిక్ష విధించినట్లు చెప్పేవారు. ఇక ఉరి ప్రక్రియ అంతా ముగిశాక మృతదేహాలను ట్రక్కుల్లో వేసి తిస్రీన్ ఆస్పత్రికి తరలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అనంతరం ఓ సామూహిక సమాధిలో అందరి మృతదేహాలను ఖననం చేసేవారు. అయితే అసద్ ప్రభుత్వం 2015 నుంచి ఈ ప్రక్రియ బయటకు రాకుండా చర్యలు చేపట్టింది. కొందరు నమ్మకమైన అధికారులకు మాత్రమే ఈ వివరాలు తెలిపేవారు. ఇక తమ వద్ద నుంచి అర్థరాత్రి పూట తీసుకెళ్లిన ఖైదీలు ఏమయ్యేవారో అన్న ఆ సమాచారం అక్కడి గార్డులకు తెలిసేది కాదు. ఈ మరణశిక్షలు అమలు చేయాలని అసద్ తరఫున గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ సిరియా, రక్షణ మంత్రి లేదా ఆర్మీచీఫ్ నుంచి ఆదేశాలు వచ్చేవి.
బాధిత కుటుంబాలకు నిరాశే
తాజాగా రెబల్స్ డమాస్కస్‌ను ఆక్రమించిన నేపథ్యంలో ఏళ్లతరబడి అదృశ్యమైన తమ వారి జాడ సైద్నాయ జైలు వద్ద ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో పెద్ద సంఖ్యలో ప్రజలు సోమవారం అక్కడికి చేరుకొన్నారు. భారీ ఇనుప తలుపులను తెరిచి అన్ని గదుల్లో గాలించినా వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో రహస్య మార్గాలు ఏమైనా ఉన్నాయేమో అని వెతుకులాట మొదలుపెట్టారు. తమవారి ఆచూకీ దొరక్క కొందరు అక్కడే కన్నీరుమున్నీరయ్యారు. 2011లో అదృశ్యమైన తన సోదరుడి కోసం డమాస్కస్ నుంచి గడా అసాద్ అనే మహిళ సోమవారం పరుగుపరుగున జైలుకు వచ్చింది. కానీ, అతడు కనిపించకపోవడంతో ఆమె కుప్పకూలిపోయింది. 13 ఏళ్లుగా నా సోదరుడి కోసం ఎదురుచూస్తున్నా అంటూ బోరున విలపించింది. వాస్తవానికి ఒకరోజు ముందే తిరుగుబాటుదారులు ఆ జైల్లోని ఖైదీలను విడుదల చేశారు.