Iran Coal Mine Collapse Incident : ఇరాన్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో 50 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మరికొందరు లోపల చిక్కుకున్నారు. రాజధాని టెహ్రాన్‌కు 540 కిలోమీటర్ల (335 మైళ్లు) దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ఘోరం జరిగిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
లోపల 70 మంది!
ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, శనివారం అర్థరాత్రి పేలుడు సంభవించింది. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహూటిన సహయక సిబ్బందిని పంపించారు. ఘటనా సమయంలో బొగ్గు గనిలో 70 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికీ 24 మంది లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు. అనేక మంది మరణించారని ప్రకటించారు.
అధ్యక్షుడి ఆదేశాలు
బొగ్గు గనిలో పేలుడు ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు. అనంతరం ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ బయలుదేరారు.
ఇదేం తొలిసారి కాదు
అయితే ఇరాన్ బొగ్గుగనిలో పేలుడు సంభవించడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. 2013లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది కార్మికులు చనిపోయారు. 2009లో పలు ఘటనల్లో 20 మంది కార్మికులు చనిపోయారు. 2017లో బొగ్గు గని పేలుడులో 42 మంది మరణించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తరచూ ఇరాన్‌లో పేలుళ్లు సంభవిస్తున్నాయి.
ఖనిజాలు పుష్కలం!
చమురు ఉత్పత్తి చేసే ఇరాన్‌లో వివిధ రకాల ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇరాన్ ఏటా 3.5 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగిస్తుంది. అయితే గనుల నుంచి సంవత్సరానికి 1.8 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీస్తుంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఉక్కు కర్మాగారాల్లో కూడా బొగ్గు వినియోగిస్తుంది.