Melanoma mRNA Vaccine Trials : మెలనోమా చర్మక్యాన్సర్ టీకా తయారీలో వైద్యులు ముందడుగు వేశారు. ఈ వ్యాధి బారిన పడిన వారికోసం మోడెర్నా, MDS ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. రెండో దశ క్లినికల్ ట్రయిల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన ఈ టీకాను కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన mRNA సాంకేతికతతో రూపొందించినట్లు వైద్యులు తెలిపారు. దీనిని mRNA -4157, V940గా పిలుస్తున్నట్లు తెలిపారు.
ఈ వ్యాక్సిన్ దశలవారిగా కీట్రుడా అనే మరో మందుతో కలిపి రోగికి ఇవ్వడం ద్వారా ప్రమాదకరమైన మెలనోమా క్యాన్సర్ తిరిగి రాకుండా నివారించవచ్చని వైద్యులు చెప్పారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇవ్వడం వల్ల, యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్‌కు చెందిన వైద్యుల నేతృత్వంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న11వందల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయని వైద్యులు తెలపారు.
తొమ్మిది డోసులు
mRNA -4157 వ్యాక్సిన్‌ను మూడు వారాలకు ఒక డోస్ చొప్పున తొమ్మిది డోసులు ఇస్తారు. మెలనోమా రోగికి శస్త్రచికిత్స చేసి తొలగించిన కణతుల నుంచి నమూనాను సేకరించి, AI ద్వారా DNA సీక్వెన్సింగ్ చేసి ఆ రోగికి తగినట్టుగా టీకాను రూపొందిస్తారు. తద్వారా ఆ వ్యాక్సిన్ శరీరంలోని క్యాన్సర్ కణాలను గుర్తించి, వెంటనే నాశనం చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి మెలనోమా తిరగబడకుండా చూస్తుందని UCLH వైద్యులు తెలిపారు. రెండో దశ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా మూడు నుంచి నాలుగో దశ మధ్య ఉన్న మెలనోమా రోగులకు ఈ టీకా ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం వరకు తగ్గించినట్లు వెల్లడించారు.
మెలనోమా అనే చర్మక్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదని ఇది మెలనోసైట్స్ కణాల నుంచి వృద్ధి చెందుతుందని వైద్యులు తెలిపారు. పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చల రూపంలో ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. మెలనోమా క్యాన్సర్ గురైన భాగంలో కణాలు అనియంత్రిత వేగంతో పెరగుతాయని చెప్పారు. ఈ వ్యాధి చికిత్స కోసం క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పద్ధతులనే వినియోగిస్తారని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ రకం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మెలనోమా కేసులు నిర్ధరణ అయినట్లు వెల్లడించాయి. యూకేలో ప్రతి ఏడాది దాదాపు 8, 400 కొత్త మెలనోమా కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు తెలిపారు.
మీ చర్మంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా? - అయితే క్యాన్సర్ కావొచ్చు!
క్యాన్సర్ నుంచి డీహైడ్రేషన్ వరకు - తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్! - Ice Apple Health Benefits