Japan Four Day Work Week : జపాన్ పౌరులు వర్క్‌హాలిక్స్‌గా పేరు పొందారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలను నేలమట్టం చేసినా, పట్టుదలతో ముందడుగు వేసి అభివృద్ధి చెందిన దేశంగా జపాన్‌ను నిలిపారు. ఎంతో క్రమశిక్షణగా ఉంటూ, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. పని విషయంలో పడి వారు వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోవడంలేదు. ఆఖరికి సంసార జీవితంపైనా దృష్టి పెట్టడంలేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పని దినాల విషయంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని సూచించింది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకుని.. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రస్తుతానికి 8శాతం సంస్థలు జపాన్ ప్రభుత్వ నిర్ణయం మేరకు 4 రోజుల పనిదినాన్ని అనుసరిస్తున్నాయి. మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి నాలుగుసార్లు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చని వివరించింది. ఈ విధానంతో నిరుద్యోగిత రేటు కొంతైనా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తక్కువ పని దినాలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని జపాన్ ప్రభుత్వం తమ ఆదేశాల్లో పేర్కొంది.
వారానికి నాలుగు పని దినాల విధానాన్ని ప్రస్తుతం టోక్యోలోని అకికో యోకోహామా అనే సంస్థ పాటిస్తోంది. ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు బుధవారం సెలవులను ఇస్తోంది. ఈ విధానం ఉద్యోగులు ఒత్తిడికి గురి కాకుండా చురుగ్గా పని చేస్తున్నారని యాజమాన్యం పేర్కొంది. తక్కువ పని దినాలు ఉండటంతో ఉద్యోగులు మరింత వేగంగా పనులను పూర్తి చేస్తున్నారని వెల్లడించింది. జపాన్‌లో ఎక్కువశాతం ఉద్యోగస్తులు ఓవర్ టైం డ్యూటీలు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని ఓ నివేదిక వెల్లడించింది.