India On Pakistan At IPU Meeting : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద ఫ్యాక్టరీలను ఆపాలంటూ పాకిస్థాన్‌పై భారత్ విరుచుకుపడింది. పాకిస్థాన్ లాంటి దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొంది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని ఆరోపించింది. స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ)148వ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ మేరకు మాట్లాడారు.
భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, చాలా మంది దీనిని ఆదర్శంగా తీసుకుంటున్నారని హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. 'జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాద దాడులు చేస్తూనే, మరోవైపు మానవ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పటం హస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఐపీయూ వంటి వేదిక ప్రాముఖ్యాన్ని పాకిస్థాన్ తగ్గించకుండా ఉంటే బాగుండేది. జమ్మూకశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాద కర్మాగారాలను పాకిస్థాన్ ప్రారంభించకుండా ఆపాలి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయటం వంటి వాటిల్లో పాకిస్థాన్‌కు చరిత్ర ఉందని ఐపీయూ సభ్యులకు బాగా తెలుసు. గ్లోబల్ టెరర్రిస్ట్ ఒసామా బిన్ లాడేన్ కూడా పాకిస్థాన్‌కు చెందినవారే. యూఎన్ భద్రతా మండలి నిషేధించిన అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నా దేశాల్లో పాకిస్థాన్‌కు రికార్డు ఉంది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. ఎవరూ ఎలాంటి ప్రచారాలు చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరు.' అని హరివంశ్ తెలిపారు.
'ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు'
ఒక పరిశ్రమ స్థాయిలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఇటీవల సింగపూర్‌లో పర్యటనలో ఉన్న భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితిలో భారత్ లేదని తెలిపారు.'ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలి. దానినుంచి తప్పించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేకపోగా, తిరిగి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి దేశమూ ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుంది. అదీ కాకపోతే, కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుంది. పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేయలేం' అని జైశంకర్ స్పష్టంచేశారు.
'భారత్ మాకు ఎప్పటికీ మిత్రదేశమే'- మాట మార్చిన మాల్దీవులు- రుణ విముక్తి కోసమే! - Maldives India Debt