Hezbollah Israel War : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ భూభాగంపైకి లెబనాన్ పలు రాకెట్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ప్రకటించింది. అయితే వీటివల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. మరోవైపు ఈ దాడి చేసింది తామేమని స్వయంగా హెజ్‌బొల్లా ప్రకటించింది.
లెబనాన్ ప్రయోగించిన వాటిలో కేవలం ఐదు మాత్రమే తమ భూభాగంలోకి ప్రవేశించగలిగాయని ఐడీఎఫ్ పేర్కొంది. వాటి వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని చెప్పింది. హెజ్‌బొల్లా తమ అత్యంత సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మృతి చెందారని ధ్రువీకరించిన 48 గంటల వ్యవధిలో ఈ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు లెబనాన్‌లోని చమా గ్రామంపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే తాము రాకెట్లు ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో నలుగురు సిరియావాసులు మృతిచెందినట్లు పేర్కొంది. పలువురు లెబనాన్ పౌరులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. అయితే హెజ్‌బొల్లా దాడులకు ప్రతిగా తాము కూడా వెంటనే రాకెట్లను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. యాతర్‌లోని వారి రాకెట్ల ప్రయోగ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
ఫాద్ షుక్ర్ మృతి
ఇజ్రాయెల్ మంగళవారం రాత్రి లెబనాన్ రాజధాని బీరుట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో ఇటీవల రాకెట్ దాడికి పాల్పడి, 12మంది చిన్నారులు సహా పలువురి మృతికి కారణమైన హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ కమాండర్ ఫాద్ షుక్ర్ లక్ష్యంగా ఈ దాడి జరిపింది. ఈ దాడిలో తమ మిలిటరీ కమాండర్ షుక్ర్ మరణించినట్లు హెజ్‌బొల్లా ధ్రువీకరించింది. దీనికి ప్రతీకారం తప్పదని కూడా హెచ్చరించింది.
ఎవరీ ఫాద్ షుక్ర్?
ఫాద్ షుక్ర్ లెబనాన్ హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరించారు. 1983లో బీరుట్‌లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్‌పై దాడిలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో షుక్ర్ గురించి సమాచారం అందించిన వారికి అయిదు మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ అతనిని హతమార్చింది.
'హమాస్ మిలటరీ చీఫ్‌ను అప్పుడే లేపేశాం'- ఇజ్రాయెల్ సంచలన ప్రకటన - Hamas Military Wing Chief Dead