Gaza Death Toll : ఇజ్రాయెల్- గాజా భీకర పోరు ఆగట్లేదు. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 150 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 313 మంది గాయపడ్డారని తెలిపింది. దీంతో ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీయనియన్ల మృతుల సంఖ్య 26,900కు చేరినందని పేర్కొంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపింది.
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇటీవలే ఇజ్రాయెల్ బలగాలపై గాజా భీకర దాడి చేసింది. సెంట్రల్ గాజాలో ఓ మిలిటెంట్ చేసిన దాడిలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మొదలైన తర్వాత జరిగిన దాడుల్లో అత్యధిక మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి. ఈ విషయంపై ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ఈ మేరకు వెల్లడించారు. రెండు భవనాలను పేల్చేసేందుకు ఇజ్రాయెల్ సైనికులు ప్రయత్నిస్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పారు. 'ఇజ్రాయెల్ సైనికులు భవనాలకు పేలుడు పదార్థాలు అమర్చుతున్నారు. అదే సమయంలో ఓ మిలిటెంట్ సైనికులకు దగ్గర్లోని ఓ యుద్ధ ట్యాంకుపై రాకెట్ ప్రొపెలెంట్ గ్రెనేడ్‌తో దాడి చేశాడు. దీంతో అనుకున్న సమయానికి ముందే పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అయిపోయాయి. ఆ రెండు భవనాలు సైనికులపై కుప్పకూలాయి' అని డేనియల్ వివరించారు.
హమాస్ దాడిలో ఐరాస ఉద్యోగుల పాత్ర
పాలస్తీనా యుద్ధబాధితుల అభివృద్ధి, సహాయం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏపై ఇటీవలే ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. హమాస్ దాడిలో ఉద్యోగుల పాత్ర ఉందని ఆరోపించింది. యుద్ధం అనంతరం గాజాలో ఆ ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపేయాలని కోరతామని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అవసరమైతే అమెరికా, యూరోపియన్ యూనియన్ మద్దతు కూడా తీసుకుంటామని తెలిపారు.
అయితే అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన మారణహోమంలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూ ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయంపై యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిని ఉద్యోగులను తొలగించామని పేర్కొన్నారు. అలానే ఇజ్రాయెల్ సమాచారం ఆధారంగా దీనిపై తక్షణమే దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు.
హమాస్ చెరలోనే ఇంకా బందీలు- ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల్లో విభేదాలు!
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా, ఇస్లామిక్ గ్రూప్ ప్రతీకార దాడులు- 122 మంది మృతి!