US Elections Trump : అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్ మద్దతుదారులను చెత్తతో పోల్చడంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్నంగా స్పందించారు. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అని రాసి ఉన్న చెత్త లారీని డొనాల్ట్ ట్రంప్ నడిపారు. లారీని నడుపుతూ విస్కాన్సిన్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చెత్త ట్రక్ మీకు నచ్చిందా? ఈ ట్రక్ కమల, జో బైడెన్‌ల గౌరవార్థంమని ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు.
BREAKING: Donald Trump gets picked up in Green Bay, Wisconsin by a garbage truck, just one day after Joe Biden called Trump supporters " garbage." pic.twitter.com/jqjiX6a43V
— Collin Rugg (@CollinRugg) October 30, 2024
ఇటీవల ట్రంప్ ర్యాలీలో హాస్యనటుడు టోనీ హించ్‌క్లిప్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్యూర్టో రికోను చెత్త ద్వీపంగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. అక్కడ తేలుతున్న ఏకైక చెత్త ఆయన మద్దతుదారులేనని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈనేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు హించ్‌క్లిప్‌ను ఉద్దేశించినవని, ట్రంప్ మద్దతుదారుల గురించి కాదని వైట్ హౌస్ స్పష్టంచేసింది. బైడెన్ కూడా దీనిపై స్పందించారు. ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ బైడెన్ వ్యాఖ్యలను ఖండించారు. 'ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు అనే దాని ఆధారంగా వారిపై విమర్శలు చేయడాన్ని నేను తీవ్రంగా విభేదిస్తాను' అని హారిస్ పేర్కొన్నారు.
ఉత్తర కొరియా సైనికులకు అమెరికా హెచ్చరికలు
మరోవైపు, ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తరకొరియా రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను తరలించడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా సైనికులకు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఒకటి, రెండుసార్లు ఆలోచించి బరిలోకి దిగాలంటూ సూచించింది. ఈమేరకు ఐక్యరాజ్యసమితిలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్డ్ వుడ్ వ్యాఖ్యానించారు. 'రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే, వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగి వెళ్తాయి. అందుకే బరిలోకి దిగేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి' అని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరును ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.