Yoga Asanas For Concentration : బిజీ లైఫ్‌లో అందరూ ఒత్తిడి అనుభవిస్తున్నారు. బ్రెయిన్‌పై పెరుగుతున్న ఈ ప్రెజర్ కారణంగా.. చాలా మంది జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. ఈ మతిమరుపు వల్ల చేసే పనిపై ఏకాగ్రత నిలపలేకపోతున్నారు. ఈ పరిస్థితి మెదడుపై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఇలా.. ఈ సైకిల్లో పడి ఎంతో మంది మానసికంగా నలిగిపోతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రోజూ సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు కొన్ని యోగాసనాలను వేయడం ద్వారా.. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.హలాసనం :
- ముందుగా వెల్లకిలా పడుకొని, చేతులను తిన్నగా చాపి, అరచేతులు నేలకు తాకించేలా ఉంచాలి.
- ఇప్పుడు కాళ్లను పైకి లేపి, మడమలను పిరుదులకు తాకించాలి. మోకాళ్లను పొట్ట వద్దకు తీసుకురావాలి.
- మెల్లిగా శ్వాసను వదులుతూ ఒక్క ఉదుటున కాళ్లను పైకి లేపాలి. నెమ్మదిగా పాదాలను తల వెనక వైపునకు తీసుకురావాలి. కాలి వేళ్లు నేలను తాకే విధంగా ఉండాలి.
- అరచేతులతో నేలను బలంగా నొక్కుతూ స్థిరంగా పెట్టండి.
- చూపును నాభి మీదకు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తూ మెడను వంచ కూడదు.
- శ్వాస మామూలుగా తీసుకుంటూ రెండు నిమిషాలు అలాగే ఉండి మునుపటి స్థితికి రావాలి.
Halasana Benefits: ఒత్తిడి తగ్గించే ఆసనం ఇదే!
వీరు చేయకూడదు :
హైబీపీ, గుండెజబ్బులు, చెవిలో చీము, జలుబు, మెడనొప్పి ఉన్నవారు, గర్భిణులు ఈ ఆసనం చేయకూడదు.
2.వృక్షాసనం :
- వృక్షాసనాన్ని 'ట్రీ పోజ్' అని కూడా అంటారు.
- ఈ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. తర్వాత పాదాలు దగ్గరగా ఉంచాలి. ఇప్పుడు చేతులు స్వేచ్ఛగా వదిలేయాలి.
- మెల్లిగా శ్వాస తీసుకుంటూ కుడిపాదాన్ని ఎడమకాలు పిక్క లేదా తొడకింద ఉంచాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస వదలండి.
- మళ్లీ శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తి ఫొటోలో చూపినట్టు నమస్కారం చేయాలి. ఈ ఆసనాన్ని 20 సెకండ్లు చేయాలి.
- ఈ ఆసనం చేసేటప్పుడు నిదానంగా శ్వాస పీల్చాలి.
- తర్వాత చేతులు కిందికి తెచ్చి, కుడికాలును దించేసి మామూలు స్థితిలోకి రావాలి.
- ఇప్పుడు ఎడమపాదాన్ని కుడికాలు తొడకింద ఉంచి, చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో నిలబడాలి. ఈ ఆసనాన్ని కూడా 20 సెకండ్లు పాటు కొనసాగించండి.
వీరు చేయకూడదు :
కండ్లు తిరుగుతున్నట్టు, అలాగే తల తిరుగుతూ వాంతులు అవుతున్నట్టు అనిపించే వారు ఈ ఆసనం వేయకూడదు.
3.పశ్చిమోత్తనాసనం :
- మొదట నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి ఫ్రీగా కూర్చోవాలి.
- ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై అనేలా ఉంచాలి. అలాగే తలను మోకాళ్లపై పెట్టే విధంగా చూసుకోవాలి.
- తర్వాత రెండు చేతులను ముందుకు చాచి రెండు పాదాలను గట్టిగా పట్టుకోవాలి.
- ఈ ఆసనం చేసేటప్పుడు రెండు మోకాళ్లు, చేతులు నిటారుగా ఉండాలి.
- వెన్నుపూస వీలైనంతవరకూ పైకి లేవకుండా నిటారుగా పడుకోబెట్టేలా చూసుకోవాలి.
- ఇలా ఒక 20-30 సెకండ్ల వరకూ ఉండాలి. తర్వాత రిలాక్స్ అవ్వాలి.
వీరు చేయకూడదు :
గర్భిణులు, హైబీపీ, గుండె సంబంధిత సమస్యలున్నవారు ఈ ఆసనం చేయకూడదు.
4.సర్వాంగాసనం :
- ముందుగా వెల్లకిలా పడుకుని మోకాళ్లను మడచి, మడమలను పిరుదులకు తాకేలా ఉంచాలి.
- ఇప్పుడు మోకాళ్లను లేపి పొట్ట వైపునకు తీసుకురావాలి. చేతులను నడుముకు ఆనించి, మెల్లిగా తుంటిని పైకి లేపాలి.
- ఇప్పుడు భుజాలు, మోచేతులు నేలకు ఆనించి ఉంచాలి. తర్వాత కాళ్లను తిన్నగా పైకి చాచాలి.
- ఇది కీలకమైన దశ. ఈ పోజినషన్‌లో శరీరం తూలిపోకుండా నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
- శ్వాసను మెల్లిగా తీసుకోవాలి.
- ఈ ఆసనం చేస్తున్నప్పుడు కళ్లు మూసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా తిరిగి మామూలు స్థితికి రావాలి.
వీరు చేయకూడదు :
ఈ ఆసనాన్ని అధిక రక్తపోటు, గుండెజబ్బులు, చెవిలో చీము, మెడనొప్పి వంటి సమస్యలు ఉన్నవారు, గర్భిణులు వేయకూడదు.