Why Women are More Anxiety Compared to Men: ఆందోళన సహజం. ఎప్పుడో అప్పుడు, ఏదో ఒక సందర్భంలో అందరూ ఆందోళనకు గురయ్యేవారే. ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబ సమస్యల దాకా బాధపడటం సర్వసాధారణం. అయితే.. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఆందోళనకు గురవుతారని నిపుణులు అంటున్నారు. పలు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా వివరిస్తున్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
హార్మోన్ల మార్పులు: శరీరంలోని హార్మోన్ల మార్పులు పురుషుల కంటే స్త్రీలను భిన్నంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. స్త్రీలు జీవితంలోని వివిధ దశల్లో ముఖ్యంగా పీరియడ్స్, గర్భధారణ సమయంలో ఈ మార్పులు అనుభవిస్తారని అంటున్నారు. ఈ మార్పులు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు దారితీస్తాయని.. తద్వారా ఈ హార్మోన్లు స్త్రీల శరీరం, మెదడు రెండింటినీ ప్రభావితం చేస్తాయని.. వీటి వల్ల ఆందోళన, చిరాకు వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.
మెదడులో రసాయన ప్రతిచర్యలలో మార్పు: స్త్రీల మెదడులో వచ్చే రసాయనిక మార్పులు పురుషులకు భిన్నంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇటువంటి మార్పుల కారణంగా, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఆందోళన రుగ్మతలకు గురవుతారని చెబుతున్నారు. ఉదాహరణకు, మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు మహిళల్లో భిన్నంగా పనిచేస్తాయని.. వీటి కారణంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా మానసిక సమస్యలను ఎదుర్కొంటారని అంటున్నారు.
2000లో జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం సెరోటోనిన్ స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు ఆందోళన రుగ్మతలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ అండ్ బయోస్టాటిస్టిక్స్లో ప్రొఫెసర్ డాక్టర్ రోనాల్డ్ కె. కెస్లర్ పాల్గొన్నారు.
వేధింపులు: నేటికీ, చాలా మంది మహిళలు.. వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వివిధ రకాల శారీరక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. అదనంగా, మహిళలు తరచుగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. కాగా, ఈ సంఘటనలు స్త్రీ మానసిక ఆరోగ్య పరిస్థితులను బాగా ప్రభావితం చేస్తాయని.. ఫలితంగా, వారు పురుషుల కంటే ఎక్కువగా ఆందోళనకు గురవుతారని అంటున్నారు.
మానసిక ఒత్తిడి: సాధారణంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు, ఉద్యోగం చేసే మహిళలు ఆఫీసు పని, ఇంటి పనులను బ్యాలెన్స్ చేసుకోవడంలో ఒత్తిడిని అనుభవిస్తారని అంటున్నారు. ఈ రకమైన మానసిక ఒత్తిడి శారీరక, మానసిక అలసటను కలిగిస్తుందని.. ఇది ఆందోళన రుగ్మతలు సహా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
అనారోగ్యకర అలవాట్లు: స్త్రీలు.. పురుషుల కంటే తక్కువ నిద్రపోతారు. మంచి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు కూడా ఎక్కువగా గురవుతారని.. ఈ అలవాట్లు కూడా ఆందోళనకు దోహదం చేస్తాయని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే - పాలు అస్సలు తాగొద్దు! - Milk Side Effects