Type 1.5 Diabetes Symptoms : మనిషిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా దెబ్బతిసే వ్యాధులలో షుగర్ ఒకటి! ఈ వ్యాధి ఒక్కసారి నిర్ధరణ అయిన తర్వాత వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం చాలా ఎక్కువగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ గురించే వింటుంటాం. అయితే కానీ టైప్ 2, టైప్ 1 తో పాటే టైప్ 1.5 డయాబెటిస్ కూడా ఉంటుంది. దీన్నే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (LADA) అని అంటారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటీ లక్షణాలు టైప్ 1.5లో ఉంటాయి. ఈ క్రమంలో టైప్ 1.5 లక్షణాలు ఏంటి? నివారణ మార్గాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
టైప్ 1, 2 డయాబెటిస్ అంటే ఏమిటి?
మధుమేహంలో పది కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రెండు. అవే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధి సోకినవారి రక్తంలో గ్లూకోజ్ (షుగర్) స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్ స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలోని ఇన్సులిన్ హార్మోన్‌ను తయారు చేసే ప్యాంక్రియాస్‌లోని కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది.
అయితే, టైప్ 1 డయాబెటిస్తో బాధపడేవారు ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటిక్ సాధారణంగా చిన్న పిల్లలు, యువకుల్లో కనిపిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ స్వయం ప్రతిరక్షక వ్యాధి కాదు. ఇది ఇన్సులిన్ నిరోధకత వల్ల వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజు ఇన్సులిన్ తీసుకోవక్కర్లేదు. ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో పిల్లలు, యువకులకు ఈ వ్యాధి నిరధారణ అవుతోంది.
టైప్ 1.5 డయాబెటిస్ అంటే ఏమిటి?
టైప్ 1 డయోబెటిస్ లాగే రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్ కణాలపై దాడి చేసినప్పుడు టైప్ 1.5 డయాబెటిస్ సంభవిస్తుంది. ఇది నెమ్మదిగా పెరుగుతుంది. ఈ వ్యాధి ఉందని తెలిసిన కొన్ని నెలలు లేదా సంవత్సరం దాకా కూడా ఇన్సులిన్ చికిత్స అవసరం పడకపోవచ్చు. అయితే 5 ఏళ్లలోపు ఇన్సులిన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టైప్ 1.5 30 ఏళ్ల దాటిన వాళ్లలో సాధారణంగా కనిపిస్తుంది.
టైప్ 1.5 డయాబెటిస్ లక్షణాలు, చికిత్స ఏంటి?
టైప్ 1.5 డయాబెటిస్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. వ్యక్తులను బట్టి మారుతుంటాయి. అధిక దాహం, తరచూ మూత్రం రావడం, అలసట, దృష్టిలో స్పష్టత లోపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటివి టైప్ 1.5 డయాబెటిక్ లక్షణాలు అని చెప్పొచ్చు. ఈ తరహా లక్షణాలు ఉంటే ఒక డయాబెటిస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. టైప్ 1.5 మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి మొదట నోటి ద్వారా తీసుకునే మందులు సరిపోతాయి. అప్పటికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో తగ్గకపోతే ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది.
ఈ విషయాలు తెలుసుకోండి?
టైప్ 1.5 డయాబెటిస్‌ను కచ్చితంగా నిర్ధరించడానికి ప్రత్యేక యాంటీబాడీ పరీక్షలు (ఒక రకమైన రక్త పరీక్ష) చేయించుకోవాలి. ఖర్చు ఎక్కువ కావడం వల్ల ఈ టెస్టులను చాలా మంది చేయరు. టైప్ 1.5 డయాబెటిస్ సాధారణంగా పెద్దవారిలో కనిపిస్తుంది. అందుకే దీన్ని కూడా టైప్ 2 డయాబెటిస్ గానే వైద్యులు అంచనా వేయొచ్చు. దాదాపుగా టైప్ 1.5 డయాబెటిస్ లక్షణాలు కూడా టైప్ 2 డయాబెటిస్ లాగే ఉంటాయి. అందుకే మొదట్లో దీన్ని అందరూ టైప్ 2 డయాబెటిస్ అనుకుంటారు.
8.9 శాతం మందికి నిరధారణ
టైప్ 1, 2 డయాబెటిస్తో పోలిస్తే టైప్ 1.5 మధుమేహం రోగులపై ఏ మేర ప్రభావం చూపుతుందనే విషయంపై తక్కువ పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా ఐరోపాయేతర జనాభాలో 2023లో 8.9 శాతం మంది టైప్ 1.5 డయాబెటిస్ బారిన పడ్డారు.
షుగర్ బాధితులు పాలు తాగొచ్చా? - పరిశోధనలో కీలక విషయాలు! - Can Diabetics Drink Milk