Eyes Protection Tips at The Beach : పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో చాలా మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే.. ఇలా వెళ్లేవారంతా కళ్ల(Eyes) ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సన్ గ్లాసెస్ ధరించండి : సాధారణంగా మనం ఏదైనా టూర్‌కి పగటిపూటనే వెళ్తుంటాం. అసలే ఎండకాలం ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. కాబట్టి.. ఈ సమయంలో బయటకు వెళ్లినప్పుడు సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవడం కోసం సన్ గ్లాసెస్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి కంటి సమస్యలు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడమే కాకుండా దుమ్ముదూళి నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయంటున్నారు.
టోపీ ధరించండి : మీరు సమ్మర్లో బయటకు వెళ్లినప్పుడు కళ్లకు రక్షణ కల్పించడానికి వెడల్పాటి అంచులు ఉన్న టోపీని ధరించాలంటున్నారు నిపుణులు. ఇది కూడా సూర్యుని నుంచి వెలువడే UV కిరణాలు కళ్లపై పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు. లేదంటే కళ్లకు సూర్యరశ్మి సోకితే ఫోటోకెరాటిటిస్ అనే వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
పోలరైజ్డ్ లెన్స్‌లను ఎంచుకోండి : మీరు వేసవిలో బోటింగ్, ఫిషింగ్ లేదా బీచ్‌లో విశ్రాంతి తీసుకోవడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనప్పుడు కళ్ల రక్షణకోసం తప్పనిసరిగా పోలరైజ్డ్ లెన్స్‌లను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పోలరైజ్డ్ సన్ గ్లాసెస్‌లో ప్రత్యేకమైన ఫిల్టర్ ఉంటుంది. ఇది నీటి ఉపరితలాలు లేదా మెరిసే వస్తువుల నుంచి వచ్చే కఠినమైన కాంతిని అడ్డుకోవడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అంతేకాదు.. కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుందంటున్నారు.
హైడ్రేటెడ్‌గా ఉండండి : సూర్యరశ్మి, ఇసుక, నీటికి ఎక్కువసేపు గురైనప్పుడు కంటి అలసట, పొడిబారడం అనే సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. ఇలాంటి టైమ్‌లో బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా అవసరమంటున్నారు. అందుకోసం తగినంత వాటర్ తాగాలని.. అది కంటి ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడుతుందని హైదరాబాద్ కామినేని హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ జయపాల్ రెడ్డి పేర్కొన్నారు.
2019లో "Investigative Ophthalmology & Visual Science" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం కూడా.. డీహైడ్రేట్ అయిన వ్యక్తులు పొడిబారిన కళ్లు, కళ్లలో మంట, దురద, దృష్టి మసకబారడం వంటి లక్షణాలను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అందుకే.. తగినన్ని నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.
ఐ డ్రాప్స్ : మన కళ్లు దుమ్మూధూళికి, ఎండ వేడిమికి బాగా పొడిబారుతుంటాయి. కాబట్టి.. ఇప్పటికీ కంటి సమస్యలు ఉన్నవారు సమ్మర్లో బయటకు వెళ్లేటప్పుడు మీ వైద్యుడి సూచన మేరకు డ్రాప్స్, మెడిసిన్ వంటివి వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వస్తున్నాయి! - మీకు రావొద్దంటే ఈ టిప్స్ పాటించండి!