Drinking Tea On Empty Stomach Side Effects : మెజారిటీ జనాలకు ఉదయాన్నే వేడి వేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే డైలీ కనీసం నాలుగైదు సార్లైనా తాగేస్తుంటారు. అయితే.. పరగడపున పాలతో చేసిన టీ, కాఫీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయాన్నే టిఫెన్ లేదా మరే ఇతర ఆహారమూ తీసుకోకుండా.. టీ, కాఫీ తాగడం వల్ల పేగులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆకలి తగ్గిపోవడంతోపాటు.. జీర్ణ క్రియ కూడా నెమ్మదిగా సాగుతుందని చెబుతున్నారు.
2018లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఏదైనా ఆహారం తిని టీ తాగిన వారి కంటే.. ఖాళీ కడుపుతో టీ తాగిన వ్యక్తులు ఎక్కువగా కడుపు నొప్పి, అజీర్ణం, వికారాన్ని అనుభవించారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘైలోని ఈస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ జాంగ్ యున్‌షియో పాల్గొన్నారు. మార్నింగ్ పరగడపున టీ తాగడం వల్ల అందులోని యాసిడ్లు కడుపులోని పొరకు చికాకు కలిగించి జీర్ణ సమస్యలకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది శరీరంలో అనేక ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అలాగే.. పెప్టిక్ అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు. అంతేకాదు.. దంతాలను కూడా దెబ్బతీసి దంత క్షయానికీ కారణం కావొచ్చంటున్నారు.
అలర్ట్ : సాయంత్రం పూట టీ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అస్సలు తాగకూడదట!
పరగడపున టీ తాగినప్పుడు అందులోని కెఫిన్ కంటెంట్ శరీరంలో డీహైడ్రేషన్‌ను పెంచుతుందట. అందుకే.. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని సూచిస్తున్నారు. అందుకే.. ఏదైనా టిఫెన్ తిన్న తర్వాత టీ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు పరగడపున టీ తాగాలనుకుంటే మాత్రం.. చాయ్ తాగడానికి ఓ 15 నిమిషాల ముందు వాటర్ తాగడం మర్చిపోవద్దు. ఎందుకంటే.. ఇది కొంత వరకు రిస్క్‌ని తగ్గిస్తుందంటున్నారు.
ఇక, చాలా మంది చక్కెర లేకుండా టీ తాగడానికి ఇష్టపడరు. కానీ, టీలో పంచదార(Sugar) కలుపుకొని తాగడం వల్ల బాడీలో హానికరమైన ద్రవాలు పేరుకుపోతాయంటున్నారు నిపుణులు. అందుకే.. డయాబెటీస్ ఉన్నవారు మిల్క్ టీకి వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అలాగే టీని పదేపదే వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయని.. అలాంటి టీ తాగడం వల్ల ఒంట్లో షుగర్ పేరుకుపోవడం మినహా ఎలాంటి ప్రయోజనమూ ఉండదని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టీ Vs కాఫీ - ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? - మీకు తెలుసా?