Side Effects Of Mouthwash : నోరు.. మన శరీరానికి గుమ్మం వంటిది. మనం ఎలాంటి ఆహార పానీయాలన్నీ తీసుకున్నా ఈ గుమ్మం ద్వారానే ఒంట్లోకి చేరుతుంటాయి. కాబట్టి.. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే చాలా మంది నోటి శుభ్రత కోసం డైలీ మౌత్‌వాష్(Mouthwash) లిక్విడ్లు వాడుతుంటారు. అయితే.. ఇవి వాడుతున్నవారు అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. లేదంటే.. క్యాన్సర్‌తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మౌత్‌వాష్ నోటిని శుభ్రంగా ఉంచడంలో కొంతమేర సహాయపడుతుంది. అలాగే కొన్ని దంత సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు.. వైరస్ వ్యాప్తితో పాటు నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గించడంలోనూ మౌత్‌వాష్ ఉపయోగపడుతుంది. అయితే.. మౌత్‌వాష్ తో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారితమైనవి తరచుగా వాడితే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ ముప్పు : మౌత్‌వాష్ లిక్విడ్‌లో ఉండే హానికర కెమికల్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు. అంతేకాదు.. దీన్ని 3 నెలలపాటు రెగ్యులర్‌గా వాడితే.. చిగుళ్ల సమస్యలతోపాటు పేగు క్యాన్సర్లూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆల్కహాల్ ఉండే మౌత్‌వాష్‌లను వాడడం వల్ల నోరు పొడిబారుతుందంటున్నారు. 2018లో "క్లినికల్ ఎక్స్‌పీరిమెంటల్ డెంటిస్ట్రీ" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆల్కహాల్ బేస్డ్ మౌత్‌వాష్ వాడిన వారిలో లాలాజలం తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డి మినాస్ గెరైస్ యూనివర్సిటీలో పని చేసే డాక్టర్ ఫెర్నాండో డోస్ రియోస్ పాల్గొన్నారు.
నోరు ఫ్రెష్‌గా ఉండాలా? తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మౌత్‌వాష్‌లు రెడీ చేసుకోండి!
ఈ ఆరోగ్య సమస్యలూ వస్తాయి : సాధారణంగా మన నోట్లో మంచీ, చెడూ అనే రెండు రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అయితే, మౌత్‌వాష్‌లోని హానికర్ కెమికల్స్ జీర్ణక్రియకూ, నోటి శుభ్రతకూ ఉపయోగపడే కీలకమైన ఓరల్ మైక్రోబయోమ్‌లను నాశనం చేస్తాయంటున్నారు. అంతేకాదు.. బీపీని నియంత్రించే యాక్టినోబ్యాక్టీరియా కూడా ఈ ఆల్కహాల్ మౌత్‌వాష్ వాడకం వల్ల తగ్గిపోతుందని సూచిస్తున్నారు. మౌత్‌వాష్‌లలో ఉండే కొన్ని రకాల కెమికల్స్ నోటి పుండ్లకు దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే ఎక్కువ రోజులు కొన్ని రకాల మౌత్‌వాష్‌లను వాడటం వల్ల దంతాలు రంగు మారే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
కాబట్టి.. మౌత్‌వాష్ కొనేముందే ఎటువంటి రకాలో చూసి తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. అదేవిధంగా రోజుకు రెండు సార్లు మాత్రమే ఒక నిమిషం పాటు మౌత్‌వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. మౌత్‌వాష్‌ను మింగవద్దని సూచిస్తున్నారు. చివరగా.. మౌత్‌వాష్‌ను డాక్టర్ల సలహా ప్రకారం వాడితేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
అలర్ట్: నోరు తెరిచి నిద్ర పోతున్నారా? - ఈ ప్రాణాంతక సమస్యలు ఎటాక్ చేయడం గ్యారెంటీ!
నోరు లేదా ముక్కు నుంచి దుర్వాసన వస్తోందా? - ఈజీగా తగ్గించుకోండిలా!