Side Effects of Brinjal : "తాజా కూరలలో రాజా ఎవరండి.. ఇంకా చెప్పాలా? వంకాయేనండి"అంటూ పాడే పాట అందరికీ తెలిసిందే. కేవలం రుచిలో మాత్రమే కాదు.. ఔషధ గుణాల్లో కూడా వంకాయ రాజే! రక్తపోటును అదుపులో ఉంచడం, ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడం, క్యాన్సర్తో పోరాడటం, బరువు తగ్గడంలో, రోగనిరోధక శక్తిని పెంచడం సహా మెదడు ఆరోగ్యానికి వంకాయలోని పోషకాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతారు. అయితే.. ఈ సమస్యలున్న వారు మాత్రం వంకాయ తినేముందు ఓసారి ఆలోచించుకోవాలని నిపుణులు చెబుతున్నారు!
బోన్స్ ప్రాబ్లమ్: ఎముకల సంబంధిత సమస్యలు ఉన్న వారు వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వంకాయలో ఉండే ఆక్సలేట్ కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని.. తద్వారా ఎముకల బలహీనంగా మారతాయని చెబుతున్నారు. కాబట్టి ఎముకల సాంద్రత తక్కువగా ఉన్నవారు వంకాయను దూరం పెట్టాలని చెబుతున్నారు.
మూత్రపిండాల సమస్య: కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయను తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కారణం.. వంకాయ గింజల్లోని ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్నీ ప్రోత్సహిస్తుందని హెచ్చరిస్తున్నారు. 2013లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినకల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక ఆక్సలేట్ ఆహారం తినే వ్యక్తులలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం 23% ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బార్సిలోనాలోని యూనివర్సిటాట్ డి బార్సిలోనాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ Jordi Salas Salvadóపాల్గొన్నారు. వంకాయతో సహా అధిక ఆక్సలేట్ ఆహారాలు మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయని వారు పేర్కొన్నారు.
జీర్ణ సమస్యలతో: జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని అంటున్నారు. వంకాయలో సాలిసైలేట్లు అనే సహజ రసాయనాలు ఉంటాయని.. ఇవి జీర్ణ సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. అలాగే వంకాయలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఎక్కువగా ఉంటాయి. కరిగే ఫైబర్ జీర్ణక్రియకు మంచిది, కానీ కరగని ఫైబర్ కొంతమందిలో గ్యాస్, ఉబ్బరాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
మొలలతో: పైల్స్ సమస్యలతో బాధపడే వారు కూడా వంకాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పైల్స్ ఉన్న వారు వంకాయ తింటే సమస్య మరింత ఎక్కువుతుందని హెచ్చరిస్తున్నారు.
మోకాళ్ల నొప్పులతో: రుమటాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.
అలర్జీలతో: స్కిన్ అలర్జీతో బాధపడే వారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని అంటున్నారు. ఫుడ్ అలర్జీ ఉన్న వారు వంకాయను తీసుకోవడం వల్ల అలర్జీ సమస్య మరింత ఎక్కువవుతుందని అంటున్నారు. 2020లో Food Allergy & Anaphylaxis జర్నల్ లో ప్రచురించిన అధ్యయనంలో అలెర్జీ ఉన్న వ్యక్తులు వంకాయ తినడం వల్ల అలెర్జీ ప్రతిచర్యలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఈ పరిశోధనలో నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆలర్జీ అండ్ ఇమ్మ్యూనాలజీలో చీఫ్ డాక్టర్ Andrew E. Faegen పాల్గొన్నారు.
కళ్ల సమస్యలు: కళ్లలో మంట, వాపు, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.