How to Improve Brain Health: మానవ శరీరంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు మందగించి.. మతిమరుపు సమస్య పెరిగిపోతుంది. అయితే ఒక లక్ష్యం, ఉద్దేశంతో జీవించటం అలవాటు చేసుకుంటే ఈ సమస్య రాదంటున్నారు పరిశోధకులు. ఒక లక్ష్యం కోసం జీవిస్తున్నామని భావించేవారికి మతిమరుపు (డిమెన్షియా) వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ జీవితం అర్థవంతమైందని భావించేవారికి డిమెన్షియా ముప్పు 35% తక్కువని 2020లో American Geriatrics Society (JAGS) జర్నల్లో ప్రచురితమైంది. "Sense of Purpose in Life and Risk of Incident Dementia" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన కాగ్నిటివ్ సైకాలజిస్ట్ యాంజెలీనా సుటిన్, బృందం పాల్గొన్నారు.
జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ప్రయత్నించేవారి మెదడు మరింత చురుకుగా పని చేస్తున్నట్లు మరో అధ్యయనంలోనూ తేలింది. వీరిలో జ్ఞాపకశక్తి, పదాల ఉచ్చారణ (ఉదాహరణకు- ఒక నిమిషంలో వీలైనన్ని జంతువుల పేర్లు చెప్పటం) వంటి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వెల్లడైంది. జీవితంలో లక్ష్య సాధన కోసం కృషి చేసేవారికి అల్జీమర్స్ సమస్య రావటం ఆరేళ్లు ఆలస్యం అవుతున్నట్లు మరికొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
ఒక లక్ష్యం గలవారితో పోలిస్తే ఏ లక్ష్యమూ లేనివారి నాడీ కణాల్లో అస్తవ్యస్త మార్పులు ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ విస్‌కాన్సిన్-మ్యాడిసన్ పరిశోధకుల మరో అధ్యయనంలో బహిర్గతమైంది. అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నవారితో పోలిస్తే వీరి మెదడు అంత ఆరోగ్యంగా లేదని తెలుస్తోంది. వీరిలో నాడీ కణాల చుట్టూరా ఉండే రక్షణ పొర (మైలిన్) క్షీణించిందని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా నేర్చుకోవటానికి, జ్ఞాపకశక్తికి తోడ్పడే హిప్పోక్యాంపస్ భాగంలోని నాడీ కణాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కాబట్టి మంచి లక్ష్యంతో ముందుకు సాగితే మెదడునూ కాపాడుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'తల్లులు సరిగ్గా నిద్రపోతేనే పిల్లలు హుషారుగా పుడతారు'- మరి ఎంత సేపు నిద్రపోవాలి?
నడుం నొప్పి తరచూ ఇబ్బంది పెడుతోందా? - దీనికి కారణం ఇవీ కావొచ్చట!