Outdoors Vs Treadmill for Walking : వ్యాయామాల్లో అన్నింటికన్నా సులభమైనది, అందరికీ అనుకూలమైనది వాకింగ్. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొంత దూరం నడిస్తే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, రక్తపోటు, క్యాన్సర్, టైప్-2 డయాబెటీస్ లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వాకింగ్ చక్కగా ఉపయోగపడుతుంది. కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా నడక చాలా మంచిది. జ్ణాపకశక్తిని పెంచేందుకు, మూడ్ స్వింగ్స్ లాంటి మానసిక సమస్యలకు చెక్ పెట్టేందుకు నడక చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు.
వ్యాయామం చేయటం వల్ల కలిగే చాలా లాభాలు ప్రతి రోజూ వాకింగ్ చేసినా కలుగుతాయట. అయితే కొందరు ఆరుబయట నడిస్తే, ఇంకొందరు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తారు. ఈ రెండూ ఒకే రకమైన ఆరోగ్య ప్రయెజనాలను కలిగిస్తాయా? రెండింటిలో ఏది బెటర్ అనే విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ట్రెడ్‌మిల్‌పై, ఆరుబయట చేసే వాకింగ్‌కు చాలా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ కేలరీలు
మీరు ఆరుబయట నడిచినప్పుడు గాలికి వ్యతిరేకంగా నడుస్తుంటారు. ఇది మీ వ్యాయామాన్ని మరింత సవాలుగా మారుస్తుంది. గాలిని నెడుతూ నడవడం వల్ల మీరు ఎక్కువ కేలరీలను ఖర్చు చేసినవారు అవుతున్నారు. ట్రెడ్‌మిల్ వాకింగ్‌లో గాలి నిరోధకత వీలు ఉండదు. ఆరుబయట వాకింగ్‌తో పోల్చితే ట్రెడ్‌మిల్ వాకింగ్ లో తక్కువ కేలరీలను ఖర్చు చేస్తారు.
అలా చేస్తే ఫలితం ఉండదు
ఆరుబయట నడిచినప్పుడు మీరు వేరు వేరు భూభాగాల్లో నడుస్తుంటారు. కొండలు, గుంతలు వంటి రకరకాల నేల మీద నడవడం వల్ల కండరాలకు శ్రమ కలిగి వ్యాయామాన్ని మరింత ఫలవంతం చేస్తుంది. అదే ట్రెడ్‌మిల్‌పై ఎప్పుడూ ఒకే ఫ్లాట్ ఉంటుంది. ఆరుబయట నడకతో కలిగే ఫలితం ట్రెడ్‌మిల్‌పై ఉండకపోవచ్చు.
మానసిక ఉత్సాహం
ట్రెడ్‌మిల్ ఉపయోగించడం కంటే ఆరుబయట నడవడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. బయట నడిచినపుడు మనం నడకతో పాటు ప్రకృతిని ఆస్వాదించడం, విభిన్న దృశ్యాలను అనుభవించడం, వేరే వ్యక్తులతో కలిసి మాట్లాడుతూ నడవడం లాంటివి చేస్తుంటాం. ట్రెడ్‌మిల్ వాకింగ్‌లో ఇవేవీ ఉండవు. దీంట్లో మానసిక ఉత్సాహాన్ని పెంపొందించేవి ఏమీ ఉండవు. ఆరుబయట నడకలో సహజమైన కదలికలు ఎక్కువ ఉంటాయి. అడుగులు, దూరం, నడక తీరులో ఇలా చాలా రకాల తేడాలు వస్తాయి. కానీ ట్రెడ్‌మిల్‌పై నడకలో అంతా కృత్రిమంగానే ఉంటుంది. ట్రెడ్‌మిల్‌పై ఒకే రకమైన ఫ్లాట్ ఉంటుంది కనుక ఒకే రకమైన అడుగులు, ఒకే రకమైన దూరం ఉంటుంది.
అమరిక సమస్యలు
ట్రెడ్‌మిల్ అమరికల్లో రకరకాల మార్పులు ఉంటాయి. ఇది అడుగుల దూరం, కేలరీల రీడింగ్ కచ్చితత్వంపై ప్రభావం చూపిస్తుంది. వేర్వేరు మెషీన్‌లపై వాకింగ్ చేయడానికి, ఆరుబయట వాకింగ్ చేయడానికి కచ్చితంగా చాలా తేడా ఉంటుంది. మొత్తం మీద ట్రెడ్‌మిల్ వాకింగ్ మీకు అనుకూలమైనది అయినప్పటికీ, బయట నడిచిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను ఇవ్వకపోవచ్చు. ఈ రెండు కలిపి చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాగులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు- A టు Z రోగాలకు సంజీవని! - Health Benefits Of Ragi