National Vaccination Day 2024 : పుట్టిన పిల్లలకు తల్లిపాల తర్వాత ఎక్కువ రక్షణనిచ్చేవి టీకాలు. అందుకే పిల్లలకు నిర్దిష్టమైన నెలల కాలంలో పలు టీకాలు వేస్తూ ఉంటారు. పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు క్రమం తప్పకుండా టీకాలు వేస్తుంటారు. ప్రముఖంగా పల్స్ పోలియో నుంచి ఈ మధ్యన వచ్చిన కరోనా టీకాల వరకు చాలా రకాల టీకాలు రక్షణగా నిలుస్తాయి. అయితే చాలామంది టీకాలు అనేవి కేవలం పిల్లలకు మాత్రమే అనే భావనలో ఉంటారు.
పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి టీకాలు వేస్తారని చాలామంది భావిస్తుంటారు. కానీ పెద్దల్లో కూడా ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా టీకాల సంరక్షణ ఎంతో అవసరం. సాధారణ ఫ్లూ జ్వరాల నుంచి దీర్ఘకాలిక సమస్యలైన హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల టీకాలు పెద్దల కోసం అందుబాటులో ఉన్నాయి.
వివిధ రకాల వ్యాధులకు పాశుపతాస్త్రంగా పని చేసే టీకాలు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి భరోసా, భద్రత లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సంరక్షణతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే శనివారం (మార్చి 16న) జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా పెద్దలకు అందుబాటులో ఉన్న టీకాలు ఏంటి? వాటి వల్ల మనకు ఎలాంటి రక్షణ లభిస్తుందో మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ఫ్లూయెంజా ఫ్లూ టీకా
ఫ్లూ జ్వరాలకు చక్కగా అడ్డుకట్ట వేయడానికి పెద్దలకు అందుబాటులో ఉన్న టీకా ఇన్ఫ్లూయెంజా ఫ్లూ టీకా. గర్భిణీలు, 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లూ జ్వరాలతో తరుచూ బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
న్యూమోకోకల్ టీకా
వృద్ధాప్యంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నిమోనియా కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వారికి న్యూమోకోకల్ టీకా ఎంతో మేలు చేస్తుంది. ఇది నిమోనియా వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది.
హెపటైటిస్ టీకా
కాలేయానికి వచ్చే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అయితే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు రెండు రకాలు. ఒకటి హెపటైటిస్-ఏ, రెండోది హెపటైటిస్-బీ. రెండింటికీ ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండు దఫాలుగా హెపటైటిస్-ఏ టీకా తీసుకోవాల్సి వస్తే, హెపటైటిస్-బీ టీకాను జీవితంలో ఒకసారి మాత్రమే తీసుకుంటే పూర్తి రక్షణ లభిస్తుంది. కొంతమంది హెపటైటిస్-ఏ, బీ రెండింటితో బాధపడుతుంటారు. అలాంటి వారికి రెండు రకాల టీకాలు వెయ్యడం ఉత్తమం.
హెచ్పీవీ టీకా
మహిళలకు శాపంగా మారిన సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం అందుబాటులో ఉన్న టీకా హెచ్పీవీ. ఇది తీసుకుంటే మహిళలకు వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు.
పైన పేర్కొన్న పలు టీకాలతో పాటు కరోనా నుంచి రక్షణ కోసం కొవిడ్ టీకా, స్వైన్-ఫ్లూ నుంచి రక్షణగా స్వైన్-ఫ్లూ టీకాలు, టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందేందుకు కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎంఎంఆర్, వారిసెల్లా, టైటానస్, డిఫ్తీరియా, పెర్టూసిస్, జోస్టర్, మెదడువాపు వ్యాధి నుంచి రక్షణకై కూడా పలు టీకాలను పెద్దల కోసం రూపొందించారు శాస్త్రవేత్తలు. వీటిని వేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చెవిలో ఏమైనా ఇరుక్కుందా? ఫస్ట్ అసలేం చేయాలో తెలుసా?
ఫుడ్ పాయిజన్ అయిందా? డాక్టర్ వద్దకు వెళ్లేముందు ఇంట్లో ఇలా చేస్తే బిగ్ రిలీఫ్!