How To Make Masala Kakarakaya Fry In Telugu : మారిన జీవనశైలి కారణంగా ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. డయాబెటిస్. ఇది వచ్చిందంటే ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటించాల్సిందే. అయితే.. చాలా మందికి ఏం తినాలనేది క్లారిటీ ఉండదు. అందుకే మీకోసం ఒక రెసిపీ తెచ్చాం. అదే.. కాకరకాయ(Bitter Gourd) . చేదుగా ఉంటుందని దీన్ని తినకుండా చాలా మంది పక్కన పెట్టేస్తుంటారు. కానీ.. దీన్ని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- అరకిలో - కాకరకాయ
- 2 - ఉల్లిపాయలు
- 3 - పచ్చిమిర్చి
- తగినంత - ఆవనూనె
- ఒక స్పూన్ చొప్పున - ఆవాలు, జీలకర్ర, సోంపు
- పావుస్పూన్ - పసుపు
- రుచికి సరిపడా - ఉప్పు, కారం
- ఒక స్పూన్ - ధనియాల పొడి
- రెండు స్పూన్లు - చాట్ మసాలా
- అర స్పూన్ - గరం మసాలా
- కొద్దిగా - కొత్తిమీర తరుగు
మసాలా కాకరకాయ ఫ్రై తయారీ విధానం :
- ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి చక్రాల్లా సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని చెంచా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూతపెట్టి పక్కన ఉంచాలి. అరగంట అయ్యాక ఆ ముక్కల్లోని నీటిని గట్టిగా పిండి ఓ గిన్నెలో వేసుకోవాలి.
- ఆలోపు మీరు రెసిపీకి కావాల్సిన ఉల్లిపాయలను నిలువుగా, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొత్తిమీరను తరిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌమీద పాన్‌పెట్టి ఆయిల్ పోసుకోవాలి. అది కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, సోంపు వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత నీటిని పిండి పక్కన ఉంచుకున్న కాకరకాయ ముక్కలను మిశ్రమంలో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కాకరకాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
- ఆ విధంగా కాకరకాయ ముక్కలు మగ్గాక పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మిశ్రమాన్ని కొద్దిసేపు వేయించుకోవాలి. ఆపై తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని దించుకుంటే చాలు.. ఘుమఘుమలాడే మసాలా కాకరకాయ ఫ్రై రెడీ!
- దీనిని వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ.. ఇలా దేనిలో తిన్నా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.
- ముఖ్యంగా.. డయాబెటిస్(Diabetes) ఉన్నవారు దీన్ని తినడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కాకరలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయంటున్నారు.
- కాబట్టి.. మధుమేహంతో బాధపడేవారు వారానికి కనీసం రెండు, మూడు సార్లైనా కాకరను తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదంటున్నారు.
ఇవీ చదవండి :
డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన బెస్ట్ సలాడ్స్ ఇవే - ప్రిపరేషన్ వెరీ ఈజీ - రుచి సూపర్‌గా ఉంటుంది!