Health Benefits Of Black Plums : వర్షాకాలంలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్య ఔషధాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా పనిచేస్తాయని అంటున్నారు. అందుకే.. అవి విరివిగా దొరికే రోజుల్లో అస్సలు మిస్ అవ్వొద్దంటున్నారు నిపుణులు. మరి.. నేరేడు పండ్లు(Black Plums) తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచతుతాయి : నేరేడు పండ్లు చూడటానికి చక్కని రంగుతో.. మిలమిలా మెరిసిపోతూ ఎంత రుచిగా ఉంటాయో.. అదే స్థాయిలో ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నేరేడులో పుష్కలంగా ఉండే ఫైటో కెమికల్స్, పాలీఫినాలిక్ ఆమ్లాలు, విటమిన్ సితో ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
ఇన్ఫెక్షన్లకి చెక్ : వానాకాలంలో ఎక్కువగా వచ్చే అతిసారం, కలరా వ్యాధులతోబాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లనీ నేరేడు అరికడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే.. సి-విటమిన్ అధికంగా ఉండటంవల్ల దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులకీ నేరేడు మంచి మందుగా పనిచేస్తుందంటున్నారు. క్రమం తప్పక తింటే కోరింత దగ్గు, టీబీ వంటివీ తగ్గుతాయట.
2023లో 'ఫిట్టోథెరపీ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. నేరేడు పండులోని పాలీఫినాలిక్ ఆమ్లాలు కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయని తేలింది. ఈ పరిశోధనలో దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. నేరుడు పళ్లను తినడం ద్వారా అందులో ఉండే పోషకాలు బ్యాక్టీరియా, వైరస్‌లను అడ్డుకుని వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయని ఆయన పేర్కొన్నారు.
జీర్ణక్రియ మెరుగు : ఈ పండ్లు తినడం ద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. అలాగే అధిక దాహం, అధిక మూత్రం వంటి లక్షణాలను ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు.
వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్‌బై చెప్పొచ్చు!
మధుమేహం నియంత్రణ : మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు పండ్లు తినడం మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇందులోని పీచు పదార్థం రక్తంలో చక్కర స్థాయిలు తొందరగా పెరగకుండా నియంత్రిస్తుందని చెబుతున్నారు. అయితే, వారంలో ఒకటి నుంచి రెండు సార్లు తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
రక్తహీనతను తగ్గిస్తుంది : ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండటంతో ఎర్ర రక్తకణాల్ని పెంచడం ద్వారా రక్తహీనతను తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఇవి నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయంటున్నారు. చిగుళ్ల నుంచి రక్తం కారటం, దుర్వాసనను అరికడతాయని సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు : నేరేడులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి చిరుతిళ్లుగా ఉపయోగపడతాయంటున్నారు. అంతేకాదు.. వీటిలో ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటిని క్రమతప్పక తినడం వల్ల వీటిలోని పొటాషియం రక్తనాళాల్లో కాల్షియం పేరుకోనీయదని తద్వారా గుండె జబ్బులను నియంత్రించుకోవచ్చని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి.
హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది : వీటిలో విటమిన్ - C, A లు, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో చాలా బాగా తోడ్పడతాయంటున్నారు. అలాగే చర్మాన్ని తాజాగా ఉంచే, కంటి ఆరోగ్యాన్ని పెంచే గుణాలు నేరేడు పండ్ల సొంతమంటున్నారు. అదేవిధంగా కాలేయానికి ఏదైనా హాని జరిగినా.. తిరిగి కోలుకోవడానికి ఈ పండ్లు సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : గర్భవతులు జామ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? - పరిశోధనలు చెప్పేది ఇదే!