Intermittent Fasting Side Effects : బరువు తగ్గడం కోసం ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన విధానమే.. "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్". ఈ పద్ధతిలో.. ఒక రోజులో ఉండే 24 గంటల్లో కేవలం 8 లేదా 6 గంటల్లోపు మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇందులోనూ తక్కువ కేలరీల ఫుడ్ ఉండేలా చూసుకుంటారు. మిగిలిన సమయం మొత్తం వాటర్ మాత్రమే తాగుతారు. అయితే.. ఈ ఫాస్టింగ్ విధానం ద్వారా వెయిట్ లాస్ ఏమో కానీ.. గుండె జబ్బుల ప్రమాదం మాత్రం కచ్చితంగా పెరుగుతుందని ఇటీవల పరిశోధనలో తేలింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇటీవల 'అమెరికా హార్ట్ అసోసియేషన్'(AHA) ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫలితాపై రీసెర్చ్ నిర్వహించింది. దీనివల్ల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుందని.. హార్ట్ ప్రాబ్లమ్స్‌తో మరణించే ప్రమాదం ఏకంగా 91% పెరిగిందని వెల్లడించింది. అయితే.. ఈ నివేదికను అమెరికా హార్ట్ అసోసియేషన్ పూర్తిగా ప్రచురించలేదు. కేవలం అబ్ స్ట్రాక్ట్ను మాత్రమే ప్రచురించింది. దాంతో, కొందరు వైద్యులు అధ్యయనం ఫలితాలను ప్రశ్నించారు. అధ్యయనంలో సర్వే చేసిన వ్యక్తుల ఆరోగ్యాల మధ్య పోలికలు, తేడాలను పరిశీలించారా? అలాగే వారికున్న ఇతర అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకున్నారా? అంటూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు.
అదే సమయంలో.. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ మెటబాలిజం ఎమెరిటస్ ప్రొఫెసర్ కీత్ ఫ్రాయిన్.. 'కేలరీల వినియోగాన్ని తగ్గించే మార్గంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' ప్రాచుర్యం పొందిందని తెలిపారు. ఈ విధానం శరీరంపై ప్రభావాలపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరమని అన్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయన నివేదిక చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేసిందని అన్నారు.
14 గంటలు ఉపవాసం ఉంటున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులు ఇవే!
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌పై ఆమెరికా హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన అధ్యయనాన్ని.. చైనాలో షాంఘైలోని జియావో టాంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు పరిశీలించారు. ఫాస్టింగ్ రీసెర్చ్‌లో పాల్గొన్న సుమారు 20,000 మంది వ్యక్తుల డేటాను షాంఘై పరిశోధకులు విశ్లేషించారు. రీసెర్చ్‌లో పాల్గొన్న సగం మంది పురుషుల సగటు వయస్సు 48 ఏళ్లుగా ఉందని చెప్పారు.
వారు అడపాదడపా ఉపవాసాన్ని ఎంతకాలం కొనసాగించారనేది క్లారిటీగా లేదని అభిప్రాయపడ్డారు. ఫాస్టింగ్‌లో ఉన్న వారి BMIలో తేడాలు ఉండొచ్చని అన్నారు. అంతేకాకుండా.. రీసెర్చ్‌లో పాల్గొన్న వారి వ్యక్తిగత హెల్త్ రిపోర్టుల ప్రకారం.. వారికి గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు సమస్యలు కూడా ఉన్నాయని షాంఘై పరిశోధకులు చెప్పారు. అయితే.. ఈ 8 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ - గుండె జబ్బుల మధ్య సంబంధం మాత్రం అలాగే ఉండొచ్చని చెప్పారు.
కాబట్టి.. నో షార్ట్ కట్స్!
ఈ పాస్టింగ్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. తమ ఆరోగ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరైనా సరైన దారిలో వెళ్లడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించి.. మీ శరీర తీరును బట్టి.. సరైన ఆహారం తీసుకుంటూ, సక్రమంగా వ్యాయామం చేస్తూ బరువు తగ్గాలని చెబుతున్నారు. అంతే తప్ప.. త్వరగా టార్గెట్ చేరుకోవాలని షార్ట్ కట్ మార్గాల్లో వెళ్తే ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.