How To Protect Mosquito Bites : వర్షా కాలం వచ్చిందంటే చాలు దోమలతో నరకంగా ఉంటుంది. చర్మంపై సూదుల్లా గుచ్చి రక్తం పీల్చడమే కాకుండా మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంటాయి. ఆడ దోమలు మనుషుల రక్తాన్ని పీల్చేసి వాటి గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ దోమలు టార్గెట్ చేసినట్లుగా కొందరు వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. అసలు ఎలా టార్గెట్ చేస్తాయో చూద్దాం.
దోమల టార్గెట్ వాళ్లే
మనిషి శరీరం నుంచి వెలువడే వాసన, శరీర ఉష్ణోగ్రత, దుస్తుల రంగు, తమ సౌలభ్యత ఆధారంగా ఆడదోమలు తమ టార్గెట్‌ను ఎంపిక చేసుకుంటాయి. కొన్ని దోమల జాతులు ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటాయని, వాటి ప్రవర్తన వింతగా ఉంటుందని అమెరికాలోని సెయింట్ లూయీస్‌లో ఉన్న టైసన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. మానవ చర్మం రసాయనాలతో కూడిన ప్రత్యేకమైన కాక్టెయిల్‌ను అతిసూక్ష్మ వాయు రూపంలో బయటికి విడుదల చేస్తుంటుంది. ఈ కాక్టెయిల్ భిన్నంగా ఉన్నవారి చర్మం వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితం అవుతుంటాయని తెలిపారు.
కార్బన్ డయాక్సైడ్‌తోనే మనుషుల జాడ
మనిషికి ఆక్సిజన్లాగే దోమలకు కార్బన్ డయాక్సైడ్ అలా అవసరం అవుతుంది. మనిషి నిశ్వాస ద్వారా బయటకు వదిలే కార్బన్ డయాక్సైడ్ కణాలు దోమలను అటువైపుగా ఆకట్టుకుంటాయి. ప్రత్యేక ఆడ ఎల్లో ఫీవర్ దోమలు మనుషుల నుంచి వచ్చే వాసనల ఆధారంగా వారిని కుట్టాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాయి. తమకు ఇష్టమైన వాసనను వెలువరించే చర్మాన్ని కుట్టడానికి చూస్తాయని నిపుణులు తెలిపారు. మనిషి జాడను కార్బన్ డయాక్సైడ్ ద్వారా 30 అడుగుల దూరం నుంచే దోమలు గుర్తించగలవని చెబుతున్నారు.
కార్బన్ డయాక్సైడ్ విడుదలయ్యే రేటును బట్టి దోమలు మనుషుల వైపు ఆకర్షితం అవుతుంటాయని అంటున్నారు నిపుణులు. గర్భిణులు, వ్యాయామాలు చేసేవారు, అధిక జీవక్రియ రేట్లు కలిగినవారి నుంచి ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంటుంది. అందుకే వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంటుందట. వ్యాయామం చేశాక, ఏమైనా పనులు చేసి అలసిపోయాక స్నానం చేయాలి. లేదంటే కనీసం రీఫ్రెష్ కావాలి. తద్వారా శరీరానికి కనీస పరిశుభ్రత లభిస్తుంది. దీనివల్ల దోమలు దరిచేరే అవకాశాలు తగ్గుతాయి.
ఆ రంగు దుస్తులు ధరిస్తే
దోమలు కార్బన్ డయాక్సైడ్‌తో పాటు దుస్తుల రంగుల ఆధారంగానూ తమ టార్గెట్‌ను ఎంచుకుంటాయి. ఓ అధ్యయనం ప్రకారం దోమలు నారింజ, ఎరుపు రంగుల తరంగ దైర్ఘ్యాలకు ఎక్కువగా ఆకర్షితం అవుతుంటాయి. దోమలకు స్పష్టమైన చూపు లేదని, అందుకే కొన్ని ప్రత్యేక రంగులను మాత్రమే అవి గుర్తించగలుగుతాయని నిపుణులు తెలిపారు. లేత రంగులతో కూడిన దుస్తులను ధరిస్తే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ముదురు రంగు దుస్తులు వేడిని త్వరగా గ్రహిస్తాయి. ఆ వేడిని తమలో నిలుపుకుంటాయి. వేడి వాతావరణం అంటే దోమలకు ఇష్టం. అందుకే దోమలు ముదురు రంగు దుస్తులు ధరించిన వారిని కుట్టడానికి ఇష్టపడాయి. ఈ ఇబ్బంది ఉండొద్దంటే లేత రంగు దుస్తులు ధరించడం మంచిది.
శరీర ఉష్ణోగ్రత ఆధారంగా
మనిషి శరీర ఉష్ణోగ్రత ఆధారంగానూ దోమలు కుట్టాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంటాయని నిపుణులు అంటున్నారు. దోమలు వేడికి ఆకర్షితం అవుతాయని, అందుకే శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నవాళ్లను ఎక్కువగా కుడుతుంటాయని తెలిపారు.
ఆ వాసనలు పసిగట్టి
చెమట వాసన, చర్మం వాసన కూడా దోమలను మనుషుల వైపు ఆకర్షిస్తుంటాయి. ఈ వాసనల ఆధారంగా ఎక్కడ కుట్టాలనేది దోమలు నిర్ణయించుకుంటాయి. మనిషి శరీరం నుంచి చెమట ఎక్కువగా విడుదలయితే చర్మంపై ఉండే బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. అది కార్బాక్సిలిక్ యాసిడ్‌ను విడుదల చేస్తుంది. ఈ యాసిడ్ వల్ల దోమలు శరీరం వైపు ఆకర్షితం అవుతుంటాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. చెమటలు బాగా పట్టేవారు రోజులో కనీసం రెండుసార్లు స్నానం చేస్తే దోమల బెడద నుంచి బయటపడొచ్చు.
పూలు, పండ్ల సమ్మేళనాలతో తయారు చేసిన సబ్బులను వాడే వాళ్లను దోమలు ఎక్కువగా కుడుతాయి. ఆ సబ్బులలోని పూలు, పండ్ల సువాసనల ప్రభావం స్నానం చేశాక కూడా చర్మంపై చాలాసేపటి వరకు ఉంటుంది. అందుకే అలాంటి సబ్బులను వాడకుండా ఉంటే దోమలు కుట్టే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది.
కొవిడ్ సోకిన చిన్న పిల్లల్లో టైప్-1 షుగర్ లక్షణాలు! - COVID 19 Type 1 Diabetes