How To Prepare Homemade Bleach : అందరూ తమ చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు చర్మసౌందర్యం విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలోనే ముఖం అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఫేస్ క్రీములు, సబ్బులు, లోషన్లు, ఫేస్ వాష్‌లు వాడుతుంటారు. అంతేకాదు.. ఫేషియల్స్, బ్లీచింగ్ అంటూ బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు.
అయితే.. బ్లీచింగ్ చేయించుకోవడం అప్పటివరకు మంచి గ్లోయింగ్ స్కిన్ అందించినా, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. బ్యూటీ పార్లర్స్‌లో వాడే ఫేషియల్ బ్లీచ్ రసాయనాలతో కూడి ఉంటుంది. కాబట్టి అలాకాకుండా కాస్త సమయం కేటాయించి.. ఇంట్లోనే సులభంగా ఇలా బ్లీచ్ తయారు చేసుకోండని సూచిస్తున్నారు. ఇది సహజసిద్ధమైనది కనుక చర్మ(Skin) ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలిగించదంటున్నారు. ఇంతకీ, నేచురల్ హెర్బల్ బ్లీచ్ కోసం కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పావుకప్పు - పుల్లటి పెరుగు
- పావు టీస్పూన్ - పసుపు
- పావు టీస్పూన్ - చందనం పౌడర్
- 2 టీస్పూన్లు - తేనె
- ఒక స్పూన్ - నిమ్మరసం
- పావు టీస్పూన్ - నారింజ తొక్కల పొడి
- పావు టీస్పూన్ - నిమ్మతొక్కల పొడి
మీ ముఖం ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే - రాత్రి వేళ ఇలా చేయండి!
బ్లీచ్ వేసుకునే విధానం :
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసుకోవాలి. ఆపై వాటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని మెత్తని పేస్టులా ప్రిపేర్ చేసుకోవాలి.
- తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కొని ఆపై ఆ మిశ్రమాన్ని ఫేస్‌కి పూతలా అప్లై చేసుకోవాలి. అలా 20 నుంచి 25 నిమిషాలు ఉంచాలి. అనంతరం చేత్తో స్మూత్‌గా మసాజ్ చేసుకుంటూ గోరువెచ్చని వాటర్‌తో కడుక్కోవాలి.
- ఇలా వారానికి ఒకసారి ఇంట్లోనే సహజసిద్ధంగా బ్లీచ్ ప్రిపేర్ చేసుకొని ముఖానికి వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోయి ముఖం అందంగా మెరిసిపోతుందంటున్నారు నిపుణులు.
- అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. సున్నిత చర్మతత్వం ఉన్న వారు దీనిని వాడే విషయంలో ఓసారి వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
2016లో "Journal of Dermatological Treatment"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పసుపులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో, మొటిమలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని గుయాంగ్‌జౌలోని సౌత్ చైనా మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ యాన్ షాంగ్ పాల్గొన్నారు. పసుపును బ్లీచ్‌లో వాడడం వల్ల అందులోని కర్కుమిన్ అనే పదార్థం.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చక్కటి పరిష్కారం : మీ ముఖం వెంటనే జిడ్డుగా తయారవుతోందా? - ఈ ఫేస్‌ప్యాక్స్‌తో తాజాగా మారిపోతుంది!