Health Benefits Of Kiwi : మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ ఎంతోమంది జబ్బుల బారినపడుతుంటారు. అందుకు ముఖ్య కారణం.. ఈ కాలంలో వాతావరణం మారటమే అని చెప్పుకోవచ్చు. అలాగే వాటర్ కలుషితం కావడం, దోమల బెడద పెరగడం కూడా వానాకాలంలో జబ్బుల విజృంభణకు కారణమవుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్లూ, డెంగీ(Dengue), టైఫాయిడ్, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటివెన్నో విజృంభిస్తుంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. డెంగీ. ఇది ఎటాక్ అయ్యిందంటే హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది.
ఆ టైమ్‌లో దీనికి తగిన చికిత్స తీసుకోకుంటే.. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, అలాంటి సమయంలో తగిన మందులు వాడుతూ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆ టైమ్‌లో కివీ ఫ్రూట్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. ఇంతకీ, కివీ పండు డెంగీ నివారణకు ఎలా తోడ్పడుతుంది? అది తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కివీ పండ్లలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ పండ్లను తరచుగా తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. వీటిలో అధికంగా ఉండే సి-విటమిన్‌తో పాటు ఇతర పోషకాలు జలుబు, ఉబ్బసం లాంటి శ్వాస ఇబ్బందులను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అలాగే.. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు, జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయంటున్నారు.
వర్షాకాలంలో ఈ డ్రింక్స్ తాగితే - రోగనిరోధక శక్తి పెరగడం పక్కా! పైగా ఈ ప్రయోజనాలు గ్యారెంటీ!
ముఖ్యంగా కివీలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు రక్తంలో ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి, డెంగీ బారిన పడినవారు ఈ ఫ్రూట్ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
2009లో "Journal of Tropical Medicine and Hygiene"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. డెంగీ జ్వరం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉన్న రోగులు రోజుకు రెండు కివీ పండ్లు తింటే వారిలో ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ చాన్ సి.ఎస్ పాల్గొన్నారు. కివీలోని పోషకాలు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగడానికి చాలా బాగా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు.. కివీ పండ్లలో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండెకు ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. అలాగే బీపీని అదుపులో ఉంచుతాయని, మలబద్ధక సమస్యను నివారిస్తాయని, అనేక రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడతాయంటున్నారు. ఎముకలను దృఢంగా ఉంచుతాయని చెబుతున్నారు.
కివీ పండ్లు తినడం వల్ల జీర్ణప్రక్రియ సవ్యంగా ఉంటుందంటున్నారు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. అలాగే.. కడుపులో మంట రాకుండా చేస్తాయి. వీటిలో అధిక కెలొరీలు, పీచు పదార్థం ఉన్నందున వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కివీ పండ్లు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చంటున్నారు. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్న దృష్ట్యా.. డెంగీ బారిన పడిన వారు మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరూ రోజూ ఒక కివీ తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పచ్చి బొప్పాయి దివ్యఔషధం! - ఈ సమస్యలతో బాధపడేవారందరికీ అమృతమే!