During Pregnancy Eating Pani Puri is Safe? : గర్భిణులు పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే మొదటి నెల నుంచే సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యం. పిండి పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్లు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలుండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. ఇలా హెల్దీ ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నా కూడా.. ప్రెగ్నెన్సీ ఉన్నవారికి రకరకాల రుచులు టేస్ట్ చేయాలని కోరికగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ లవర్స్ అయితే.. తప్పకుండా బయట దొరికే పానిపూరీ, నూడుల్స్, మంచూరియా వంటివి తినాలనిపిస్తుంది. మరి గర్భంతో ఉన్నప్పుడు బయట దొరికే చిరుతిళ్లు తినొచ్చా? తింటే ఏమవుతుంది? అనే విషయాలను నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
పోషకాలు ఎక్కువగా ఉండాలి..
గర్భిణులు ఎటువంటి ఆహారం తీసుకుంటే అదే బిడ్డకు అందుతుందని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఆహార ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. గర్భం ధరించిన సమయంలో చాలా మందిలో రక్తహీనత సమస్య కనిపిస్తుంటుంది. దీన్ని గుర్తించడానికి బ్లడ్‌లో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఎత్తుకు తగ్గ బరువు పెరుగుతున్నామో లేదో చూసుకోవాలి.
గర్భణీగా ఉన్నప్పుడు ప్రయాణాలా..? ఇవి గుర్తుపెట్టుకోండి!
దూరంగా ఉంటేనే మంచిది..
గర్భంతో ఉన్నప్పుడు బయట దొరికే పానీపూరీ వంటివి తినడం మంచిది కాదని నిపుణులంటున్నారు. ఎందుకంటే.. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల హై-బీపీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే బిర్యానీ, నూడుల్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇందులో తక్కువ క్యాలరీలుంటాయి. ఇవి తల్లి బిడ్డకు అవసరమైన విటమిన్స్, మినరల్స్, పీచు వంటి పదార్థాలను అందించలేవని చెబుతున్నారు. అలాగే.. వీటిని తినడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో అవసరమైన ఐరన్, విటమిన్ సి, ఏ, ఒమేగా ప్యాటీ ఆమ్లాలు కూడా శరీరానికి అందవని చెబుతున్నారు.
బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం..
బయట దొరికే పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీ వంటి వాటిని కొంతమంది అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేయవచ్చు. దీనివల్ల విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. అలా జరిగితే తల్లి ఆరోగ్యంతో పాటు, కడుపులో ఉన్న బిడ్డ కూడా బలహీనంగా అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా బయట దొరికే ఆహారం తినాలనిపిస్తే ఇంట్లోనే తయారు చేసుకుని తినాలని అంటున్నారు.
సమతుల ఆహారం ముఖ్యం..
గర్భిణులు అనారోగ్యకరమైన బరువు పెరగకుండా, రక్తహీనత లేకుండా ఉండాలంటే మాంసకృత్తులను తగిన మోతాదులో తీసుకోవాలి. అలాగే గుడ్లు, పప్పు దినుసులు, చేపలు, సోయా నట్స్ లాంటివి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. గర్బిణులు సమతుల ఆహారం తీసుకుంటూనే డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, ఆకుకూరలను తీసుకోవాలి. ఇంతే కాకుండా.. రాగులు, విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, టొమాటో, ఉసిరి, వంటివి తినాలని చెబుతున్నారు. పాలు, పెరుగును ఆహారంలో రోజూ భాగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు.