Health Benefits of Dates Soaked In Ghee : ఆయుర్వేదం ప్రకారం.. ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖర్జూరాలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, నెయ్యిలో నానబెట్టి తింటే.. కఫ, వాత, పిత్త సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళన, గుండె దడ లాంటి సమస్యల నివారణకూ నెయ్యి ఖర్జూరం మిక్స్ ఎంతో ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఎముకలు పటిష్ఠంగా ఉండడానికి, గుండె ఆరోగ్యానికి ఈ సూపర్ ఫుడ్ ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
ఎనర్జీ బూస్ట్ : ఖర్జూరంలో సహజ చక్కెరలు, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తింటే మంచి ఎనర్జీ బూస్ట్ లభిస్తుందంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే.. ఉపవాసం విరమించే క్రమంలో చాలా మంది వీటిని తీసుకుంటుంటారు. ఈ చక్కెరలు సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు.. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ కూడా మంచి శక్తిని అందిస్తుందని సూచిస్తున్నారు.
Health Benefits Of Dates : సంతానం లేమి సమస్యకు దివ్యౌషధం.. ఖర్జూరం!
జీర్ణక్రియకు మేలు : నెయ్యిలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేకాదు.. నేతిలో ఉండే కొవ్వులు జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో సహా పలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి, మలబద్ధకాన్ని పూర్తిగా నివారించడంలో చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు.
2018లో 'The Journal of Nutrion'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఖర్జూరాలు తినే వారికి మలబద్ధకం తగ్గిందని, జీర్ణక్రియ మెరుగుపడిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ మహ్మద్ అలి ఎజాతి పాల్గొన్నారు. నేతిలో నానబెట్టిన ఖర్జూరాలు తినే వారిలో జీర్ణసమస్యలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
రోగ నిరోధకశక్తి పెరుగుతుంది : నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. మన శరీరంలోని క్షీణించిన కణజాలాలను మరలా రిపేర్ చేస్తుందంటున్నారు. అలాగే.. ఖర్జూరం, నెయ్యి రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నేతిలో నానబెట్టిన ఖర్జూరాలు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు ఇది తినడం వల్ల గర్భాశయం ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. ఫలితంగా సుఖ ప్రసవం జరగడానికి అవకాశం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే : ముందుగా 10 నుంచి 12 విత్తనాలు లేని ఖర్జూరాలు తీసుకొని వాటిని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కాస్త వేడి అయ్యాక ఖర్జూరాలు వేసి లో ఫ్లేమ్ మంట మీద కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చుకొని నెయ్యితో సహా ఒక గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఆపై డైలీ రెండు లేదా మూడు తింటే పైన పేర్కొన్న ప్రయోజనాలన్ని మీ సొంతం చేసుకోవచ్చు!
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.