Health Benefits of Coriander Tea : మనం డిస్కస్ చేస్తున్న సమ్మర్ స్పెషల్ హెర్బల్ టీ(Herbal Tea)ని ధనియాలతో తయారు చేస్తారు. ఈ హెర్బల్ టీ.. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ పొందవచ్చంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చల్లగా.. వేడిగా.. : ధనియాల టీ ఆరోగ్య ప్రయోజనాలతోపాటు మంచి రుచిని కూడా అందిస్తుంది. అంతేకాదు.. ఇది వేడిగా లేదా చల్లగా ఎలాగైనా ఆస్వాదించగల మంచి రిఫ్రెషర్. దీనిలో ఉండే పోషకాలు శరీరాన్ని చల్లబరచడానికి, హెడ్రేట్గా ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి దీనిని సమ్మర్‌లో తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : ధనియాల టీ డైయూరిటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను నియంత్రించి జీర్ణక్రియను మెరుగపర్చడంలో చాలా బాగా సహాయపడుతుందని అంటున్నారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి బిగ్ రిలీఫ్ అందిస్తుందని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ యాస్మిన్ సూచిస్తున్నారు.
అలాగే.. 2018లో 'ఫుడ్ ఫంక్షన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ధనియాల టీ జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచడంలో, జీర్ణ సమస్యల లక్షణాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని కనుగొన్నారు. ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్లు ఈ పరిశోధన చేపట్టారు.
మైగ్రేన్ నుంచి ఉపశమనం : మీరు మైగ్రేన్ నొప్పితో బాధపడుతుంటే ధనియాల టీ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి క్విక్ రిలీఫ్ పొందవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ హెర్బల్ టీలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, నొప్పిని నివారించే లక్షణాలు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు.
సమ్మర్‌లో చెరకు రసం తాగుతున్నారా ? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే! - Sugarcane Juice Benefits
విషాలు బయటకు : మీరు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు ధనియాల టీ తాగడం.. కాలేయం, గాల్ బ్లాడర్ కు చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు చక్కగా తోడ్పడుతుందంటున్నారు.
ఎముకల ఆరోగ్యానికి మేలు : కొత్తిమీర టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. కీళ్ల నొప్పులు, రుమాటిజం, ఇతర ఇన్ఫ్లమేటరీ పరిస్థితులను తగ్గించడంలో చాలా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ టీని రెగ్యులర్‌గా తీసుకోవడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుందంటున్నారు.
ధనియాల టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే?
ఇందుకోసం ముందుగా ఒక పాత్రలో లీటర్ వాటర్ తీసుకొని స్టౌ మీద మరిగించుకోవాలి. అలా మరుగుతున్న నీటిలో రెండు టేబుల్ స్ఫూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి. వాటర్ రంగు మారే వరకు చిన్న మంట మీద హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కలిపి కాసేపు చల్లార్చుకోవాలి. ఆపై.. దాన్ని వడకట్టుకొని తాగేయాలి. అవసరమైతే కాస్త తేనె కలుపుకొని తాగవచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.