Chronic Cough Heart Failure : అనుకోకుండా మన ఊపిరితిత్తుల్లోకి దుమ్ము లేదంటే ధూళి లాంటివి చేరుతుంటాయి. ఈ మలినాలను బయటకు వెళ్లగొట్టేందుకు ఊపిరితిత్తులు శ్లేష్మాన్ని తయారు చేస్తాయి. మనం దగ్గినప్పుడు ఈ శ్లేష్మం బయటకు వస్తుంది. తద్వారా మన ఊపిరితిత్తులు శుభ్రం అవుతుంటాయి. ఇలా ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి దగ్గు వస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఆస్తమా, బ్రాంకైటిస్, సీఓపీడీ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా దగ్గు వస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల వాపు తగ్గినప్పుడు దగ్గు తగ్గుతుంది.
వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి
మందులు వాడినా దగ్గు తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటే వెంటనే గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిజానికి గుండె వైఫల్యం అనేది శ్వాసకోశ సంబంధిత సమస్యల ద్వారా తొలిసారి బయటపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. అయితే దగ్గు తగ్గకపోతే, గుండె పనితీరుపై అనుమానం కలిగితే మాత్రం వైద్యులను సంప్రదించాలి. వారు రకరకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం దీనిపై ఓ కచ్చితమైన నిర్ధరణకు వస్తారు.
దగ్గుతో పాటు ఈ సమస్యలు కూడా
సాధారణంగా గుండె కండరం బలహీనపడటం వల్ల రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గుతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లోని గాలితిత్తిలో ద్రవం పోగవుతుంది. ఈ ద్రవాన్ని బయటకు పంపే ప్రక్రియలో భాగంగా దగ్గు విడవకుండా వస్తుంటుంది. దగ్గుతో పాటు ఆయాసం రావడం, వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు అతిగా ఆయాసంగా అనిపించడం, పిల్లికూతలు, ఛాతిలో బరువుగా అనిపించడం లాంటివి జరుగుతుంటాయి.
గుండె వైఫల్యానికి సంకేతాలు
యాంటీ బయాటిక్ మందులు, స్టెరాయిడ్స్ వాడినా దగ్గు తగ్గకపోతే గుండె వైఫల్యం ఉందేమో అని అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగడం, కాళ్లలో వాపు, కడుపు ఉబ్బరం, శ్వాస పెరగడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిస్సత్తువ, వికారం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం లాంటివి కూడా గుండె వైఫల్యానికి సంకేతాలు కావచ్చంటున్నారు.
అలవాట్లు మార్చుకోండి
రక్త పరీక్ష, ఛాతీ ఎక్స్-రే, ఎకో-కార్డియాగ్రామ్, థ్రెడ్మిల్ టెస్ట్, గుండె ఎమ్మారై లాంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె వైఫల్యంపై వైద్యులు ఓ స్పష్టతకు వస్తారు. ఒకవేళ గుండె వైఫల్యం ఉన్నా అది తేలిపోతుంది. అలాగే తీవ్రత కూడా ఈ టెస్టుల ద్వారా తెలుస్తుంది. అవసరాన్ని బట్టి ఏసీఈ ఇన్-హిబిటార్, బీటా బ్లాకర్ లాంటి మందులను వాడమని వైద్యులు సూచించవచ్చు. కొందరికి మాత్రం ఎక్కువ డోసేజ్ ఉండే మందులు వాడమని ప్రిస్క్రైబ్ చేయవచ్చు. అయితే కేవలం మందుల మీదే ఆధారపడకుండా ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే కూడా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు వైద్యులు.
ఆహారంలో కూరగాయలు, పండ్లు, గింజలు తీసుకోవాలని, చేపలు, కొవ్వు పదార్థాలు, మాంసం, కూల్ డ్రింక్స్ మానేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అధిక బరువుతో గుండె మీద ఎక్కువ భారం పడుతుంది కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలంటున్నారు. డాక్టర్ల సలహా మేరకు శరీరానికి తగినంత శారీరక శ్రమను అందించండి. అంటే యోగా, వ్యాయామం, ఎక్సర్సైజ్లు లాంటివి చేయండి. మద్యం జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఒకవేళ అలవాటు ఉంటే పరిమితం చేసుకోవాలి. ధూమపానం అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వాంతులు, మైకంతో బాధపడుతున్నారా- ఈ సింపుల్ టిప్స్‌తో సమస్యలకు చెక్!
గుడ్ కొలెస్ట్రాల్‌తో ఎన్నో ప్రయోజనాలు! ఈ నూనెలు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు!!