Cancer Causing Chemicals in Car : కారు మనల్ని త్వరగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. కానీ.. అదే కారు త్వరగా క్యాన్సర్ బారిన కూడా పడేస్తుందని మీకు తెలుసా? ఇటీవల విడుదలైన ఒక అధ్యయనం ఇదే విషయం చెబుతోంది. ఈ రీసెర్చ్ ప్రకారం.. కారులో ఎక్కువగా ప్రయాణించడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందట. ఈ అధ్యయనం ద్వారా కొన్ని నమ్మలేని నిజాలను పరిశోధకులు వెల్లడించారు. మరి.. కారులో ప్రయాణించడానికి క్యాన్సర్‌కు సంబంధం ఏంటి? కారు జర్నీ వల్ల క్యాన్సర్ ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పరిశోధన వివరాలు!
"ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కారులో ప్రయాణించేవారు క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారట. సాధారణ రోజుల కంటే.. వేసవి కాలంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ కెమికల్స్ కారు క్యాబిన్ నుంచి ఇంకా ఎక్కువ విడుదలవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో 'డ్యూక్ విశ్వవిద్యాలయం'లోని టాక్సికాలజీ శాస్త్రవేత్త 'రెబెక్కా హోహెన్' పాల్గొన్నారు. అలాగే ఈమె ఈ అధ్యయనానికి ప్రధాన పరిశోధకురాలిగా పనిచేశారు.
ఏడేళ్లపాటు రీసెర్చ్..
ఈ పరిశోధనలో 2015 నుంచి 2022 మధ్యలో విడుదలైన 101 కారు మోడళ్లను పరిశీలించారు. ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల ఎయిర్ క్యాబిన్‌లను విశ్లేషించారు. అయితే.. 99 శాతం కార్లలో TCIPP అనే ఫ్లేమ్ రిటార్డెంట్ ఉందని వారు గుర్తించారు. అలాగే చాలా కార్లలో TDCIPP, TCEP అనే క్యాన్సర్ కారక ఫ్లేమ్ రిటార్డెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. వీటిని వెలువడే కారకాలను ఎంత ఎక్కువగా పీల్చితే.. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సగటున ఒక వ్యక్తి రోజూ గంటపాటు హానికరమైన రసాయనాలను పీల్చడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని రెబెక్కా తెలిపారు.
సమ్మర్లో ఎక్కువ..
ఎండాకాలంలో ఎండవేడి కారణంగా కారు క్యాబిన్‌లో ఈ హానికరమైన రసాయనాలు ఇంకా ఎక్కువ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ రసాయనాలు పెద్దల కంటే పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలున్నాయట. కాబట్టి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.
కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇలా చేయండి :
- వీలైనంత వరకు కారును ఎండలో పార్క్ చేయకండి.
- చెట్టు నీడలో లేదా గ్యారేజ్‌లో పార్కింగ్ చేస్తే మంచిది.
- అవకాశం ఉన్న ప్రతిసారీ కారు విండోస్ తీయండి.
- దీనివల్ల క్యాబిన్‌లోని గాలి మొత్తం బయటకు వెళ్లి ఫ్రెష్ ఎయిర్ నిండుతుంది.
- కారు ఆగి ఉన్నప్పుడు అందులో మీరు ఎక్కువసేపు ఉండాల్సి వస్తే.. విండోస్ తీసి కూర్చోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.