Health Benefits of Urad Dal : మినప పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు.. దీనిని తీసుకోవడం ద్వారా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు నిపుణులు. మరి, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మినప పప్పుతో చేసిన వంటకాలు డైలీ డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇంతకీ, మినప పప్పులో ఎలాంటి పోషకాలు ఉంటాయి? దీనిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాల స్టోర్ హౌజ్ : మినప పప్పులో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే.. ఈ పప్పును పోషకాల గనిగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా దీన్ని డైలీ డైట్లో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : మినప పప్పులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి, దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
మధుమేహులకు దివ్యౌషధం : ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బందిపెడుతున్న అనారోగ్య సమస్య.. డయాబెటిస్(Diabetes). షుగర్ బాధితులు ఎక్కడ గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయనే భయంతో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తుంటారు. అలాంటివారు మినప పప్పును డైలీ డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అందులో పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్(National Library of Medicine రిపోర్టు), ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు.
2018లో "జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బ్లాక్ ఉరద్ పప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు 'డాక్టర్ ప్రవీణ్ కుమార్' పాల్గొన్నారు.
బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి : మినప పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం, పాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. అదేవిధంగా బరువు(Weight) తగ్గాలనుకునేవారు ఈ పప్పుతో చేసిన ఆహారాలు డైట్లో చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. దీనిలో ఎక్కువగా ఉండే ఫైబర్ ఆకలి కోరికలను నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుందంటున్నారు.
రక్తహీనతను తగ్గిస్తుంది : మినప పప్పులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే.. కిడ్నీల సంరక్షణలో ఈ పప్పు అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు. అదే విధంగా దీనిలోని పోషకాలు తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యల నుంచి బయటపడడానికి సహాయపడుతాయంటున్నారు నిపుణులు.
చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది : మినప పప్పు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పప్పులోని పోషకాలు సన్ టాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అదేవిధంగా.. జుట్టు ఆరోగ్యానికి మినప పప్పు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
రీసెర్చ్ : మీ ఒంట్లో షుగర్ ఎంత ఉన్నా- లవంగాలు ఇలా తీసుకుంటే చాలు! - దెబ్బకు నార్మల్ అయిపోతుంది!
డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏం జరుగుతుంది? - పరిశోధనలో తేలిందిదే!