Best Parenting Tips For Child : ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వాడుతూ.. చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో.. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వారు చదవకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అయితే.. డైలీ పేరెంట్స్ కొన్ని టిప్స్ పాటించడం వల్ల పిల్లలు చదువుపై శ్రద్ధ పెడతారని, మంచి మార్కులతో పాస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు బాగా చదవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టైం టేబుల్ సెట్ చేయండి :
పిల్లలు బాగా చదవడంలో, మంచి మార్కులు తెచ్చుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే.. వారికి ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటే ముందు నుంచే వారికి ఒక టైమ్ టేబుల్‌ను ప్రిపేర్ చేసి ఇవ్వండి. వారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి ? ఎన్ని సబ్జెక్టులు చదవాలి ? అనే విషయాలను అందులో చెప్పండి. దీనివల్ల వారు ఈజీగా చదవగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్‌గా మీరు ఇవి పాటించాల్సిందే!
ఇంట్లో ప్రశాంతంగా :
పిల్లలు స్కూల్ నుంచి ఇంటి రాగానే హోమ్‌వర్క్ చేయాలంటే, అలాగే టీచర్‌లు చెప్పిన పాఠాలను చదవాలంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కాబట్టి, వారు చదువుకునే టైమ్‌లో టీవీ ఆఫ్ చేయండి. వీలైతే ఇంట్లో వారికి ఒక స్టడీ రూమ్‌ను ఏర్పాటు చేయండి. దీనివల్ల పిల్లలు బాగా చదివే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.
పిల్లలను ప్రోత్సహించండి :
గణితం, సైన్స్ వంటి కొన్ని సబ్జెక్టులు కొంచెం కష్టంగా ఉంటాయి. కొన్ని సార్లు పిల్లలకు అవి అర్థం కాకపోవచ్చు. కాబట్టి, మీ పిల్లలకు ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తున్నాయి? ఎందులో ఫెయిల్ అవుతున్నారో గుర్తించండి. తర్వాత వారిని మీరు దగ్గర ఉండి చదివించండి. ఇంకా వారు ఆ సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ట్యూషన్‌లో చేర్పించండి.
లక్ష్యాన్ని నిర్దేశించండి :
తల్లిదండ్రులు పిల్లలతో క్లోజ్‌గా ఉంటూ.. వారిని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించండి. తర్వాత వారు మీరు అనుకున్నట్లుగా ఎక్కువ మార్కులు సాధిస్తే వారికి గిఫ్ట్‌లను అందించండి. ఇలా చేయడం వల్ల వారికి చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా అని ఎప్పుడూ పిల్లలను చదవమని కోపంగా చెబితే మొదటికే మోసం వస్తుందని తెలియజేస్తున్నారు.
- తల్లిదండ్రులు వారి పిల్లలను ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చవద్దు. దీనివల్ల పిల్లలు తమను తాము తక్కువగా అంచనా వేసుకునే అవకాశం ఉంది.
- ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ వాడకుండా జాగ్రత్తలు పాటించండి.
- అలాగే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆటలు ఆడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
- ఇంకా పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి తల్లిదండ్రులు రోజూ పౌష్టికాహారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- రోజూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలను దగ్గరకు తీసుకుని స్కూల్‌లో జరిగిన విషయాల గురించి అడగాలి. వారికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే మొహమాట పడకుండా చెప్పమని కోరాలి.
- చివరిగా మీ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయినా కూడా తిట్టొద్దు, కొట్టొద్దు. ఇలా చేయడం వల్ల వారు మిమ్మల్ని చూసి భయపడతారు. కాబట్టి, మళ్లీ ప్రయత్నించమని, బాగా కష్టపడి చదవమని ప్రోత్సహించాలి.