Best Foods to Eat Healthy Liver : కాలేయం.. మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. శరీరంలోని రెండో అతి పెద్ద అవయవం కూడా ఇదే. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కాలేయం. రక్తం నుంచి విషపదార్థాలను తొలగించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే లివర్.. బైల్ అనే ఫిజియోలాజికల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది షుగర్ స్ధాయిలను నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైన రక్తాన్ని శరీరానికి అందించడంలో కాలేయానిదే(Liver) కీలక పాత్రగా చెప్పుకోవచ్చు.
అయితే, ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి.. కారణంగా చాలా మంది లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు, కాలేయ సమస్యల వల్ల మధుమేహంతో పాటు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే.. కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, దాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకోసం కొన్ని బెస్ట్ ఫుడ్స్ సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పసుపు : పసుపులో కర్కుమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఫైబ్రోసిస్, నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, సిర్రోసిస్ నుంచి కాలేయాన్ని రక్షిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే, కాలేయాన్ని శుభ్రపర్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.
వెల్లుల్లి : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారపదార్థాలలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు కాలేయాన్ని దెబ్బతినకుండా రక్షించడంలో, కొన్ని కాలేయ వ్యాధుల చికిత్సలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
తృణధాన్యాలు : వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ బి, ఫాస్పరస్, మాంగనీస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవేకాకుండా తృణధాన్యాలలో ఉండే మరికొన్ని పోషకాలు రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించి కాలేయానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలలో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్ : బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలలో.. విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది వివిధ రకాల కాలేయ వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, గ్లూటాతియోన్ అధికంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
2015లో జర్నల్ ఆఫ్ హెపటాలజీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల నాన్-ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి ఉన్న రోగులలో కాలేయ వాపు, కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుందని తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న సౌదీలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్. మహ్మద్ ఎస్. అబ్దోల్లాహి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలూ మెరుగుపడ్డాయని, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గాయని పేర్కొన్నారు.
పండ్లు : కాలేయాన్ని ఉత్తేజపరిచేందుకు పండ్లు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లు కాలేయాన్ని ఉత్తేజపరచడమే కాకుండా హానికరమైన పదార్థాలను నీటి ద్వారా గ్రహించగలిగే రూపాల్లోకి ఉత్పత్తి చేయడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. అలాగే లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మద్యంతో లివర్ డ్యామేజ్ ఇలా జరుగుతుందయ్యా - మందు బాబులూ ఓ లుక్కేసుకోండి!