Benefits Of Brisk Walking: నేటి ఆధునిక కాలంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. మెజార్టీ జనాలు ఉద్యోగం, వ్యాపారం అంటూ రోజంతా బిజీబిజీగా గడుపుతున్నారు. ఫలితంగా శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల ఎక్కువ మంది చిన్నవయసులోనే గుండె జబ్బులు, షుగర్, బీపీ వంటి వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల వల్ల ఎంతో మంది అకాల మరణాలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే రోజూ గంటలపాటు నడవాల్సిన అవసరం లేదని.. కేవలం 11 నిమిషాలు చురుకుగా వాకింగ్ చేస్తే చాలని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలను పరిశోధకులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
గుడ్‌న్యూస్!: ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి టైమ్ లేదనే వారికి ఇది ఒక తీపి వార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం లేదనే కారణంతో చాలా మంది నడకకు దూరంగా ఉంటారు. కానీ, రోజూ 11 నిమిషాలు చురుకుగా నడిస్తే చాలు.. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని (రిపోర్ట్) పరిశోధకులు ఓ అధ్యయనంలో తేల్చారు. 2023లో 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజు కనీసం 11 నిమిషాలు (వారానికి 75 నిమిషాలు) నడవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 30 లక్షల మంది ప్రజల ఆరోగ్య డేటాను పరిశీలించారు. ఈ రీసెర్చ్‌లో యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ సోరెన్ బ్రేజ్' పాల్గొన్నారు.
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ల వంటి వివిధ రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. కాబట్టి డైలీ 11 నిమిషాలు చురుకుగా వాకింగ్(Brisk Walking) చేయడం వల్ల అకాల మరణాలను అడ్డుకోవచ్చని పరిశోధకులు వివరించారు.
నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- కేవలం 11 నిమిషాలు నడవడం వల్ల బరువు తగ్గకపోవచ్చు. కానీ, ఇది క్యాలరీలు బర్న్ చేయాడానికి కొంత తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు.
- వాకింగ్ చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
- అలాగే రోజూ నడవడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా హార్ట్ హెల్త్ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
- నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కుటుంబ బాధ్యతలు, ఆఫీసు పనుల వల్ల ఒత్తిడిని అనుభవిస్తారు. అయితే, ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు కూర్చోకుండా కాసేపు అలా ఫాస్ట్‌గా నడిస్తే స్ట్రెస్ తగ్గుతుందని అంటున్నారు.
- కీళ్ల నొప్పులతో బాధపడేవారు నడక వల్ల కొంత మేర ఉపశమనం పొందవచ్చు.
- వాకింగ్ చేయడం వల్ల మధుమేహం రాకుండా చూసుకోవచ్చు.
- నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డైలీ కొంత సేపు నడవడం వల్ల రాత్రి చక్కగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
"ఆరోగ్యానికి 10 వేల అడుగులు" - ఈ కాన్సెప్ట్ నిజంగా మంచిదేనా? - రీసెర్చ్‌లో ఆసక్తికర విషయాలు!