Benefits Of Drinking Potato Juice : బంగాళదుంపలు అంటే చాలా మందికి ఇష్టం. దీనితో కూర, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వివిధ రకాల ఆహారాలు చేసుకుని తింటుంటారు. కాగా, ఇందులోని పలు పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బంగాళదుంప జూస్ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి? పొటాటో జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బంగాళదుంప రసం తాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు :
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: బంగాళదుంప రసం.. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడే రెసిస్టెంట్ స్టార్చ్‌ను కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుందని అంటున్నారు. అలాగే ఈ జ్యూస్ పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటున్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది : బంగాళదుంప రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ రసం తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
రక్తపోటు అదుపులో : బంగాళదుంప రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు బంగాళదుంప రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. 2015లో 'భారతీయ జర్నల్ ఆఫ్ క్లినికల్, లేబొరేటరీ మెడిసిన్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఆలుగడ్డ రసం తాగిన వారిలో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ శ్రీనివాస రావు పాల్గొన్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు బంగాళదుంప రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది: ఈ రసంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తరచుగా బంగాళదుంప రసం తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మంచిది: బంగాళదుంప రసంలో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను వ్యాకోచింపజేసి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. అలాగే ఈ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా..
- బంగాళదుంప జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
- ఈ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది. దీనివల్ల చర్మం ఎల్లప్పుడూ మృదువుగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది.
- డార్క్ సర్కిల్స్‌తో బాధపడేవారు బంగాళదుంప రసం తాగడం వల్ల ఇవి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలి ?
- మొలకలు లేని 3 బంగాళదుంపలను తీసుకుని వాటిపైన ఉన్న తొక్కను తీసేయండి.
- ఇప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- జ్యూస్‌ను వడపోసి గ్లాస్‌లో పోసుకుని తాగడమే. కావాలంటే రుచి కోసం తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.