Ayurvedic Home Remedies For Dandruff Problem : మన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే వాటిలో జుట్టు కూడా ఎంతో ముఖ్యమైనది. అందుకే మనలో చాలా మంది జుట్టుపట్ల శ్రద్ధ చూపుతూ ఉంటారు. అయితే రకరకాల కారణాల వల్ల ఈ మధ్య కాలంలో అనేక జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు రాలడం, తెల్లబడటం, చుండ్రు ఏర్పడటం లాంటి అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కాగా చాలామంది జుట్టులో అధికంగా ఉండే చుండ్రు లేదంటే డాండ్రఫ్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ సమస్యలన్నింటికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.
హెయిర్ ఫాల్‌కు ఆయుర్వేద పరిష్కార మార్గాలు
చుండ్రు లేదా డాండ్రఫ్ నుంచి వెంట్రుకలకు విముక్తి కోసం మార్కెట్లోని అనేక షాంపులు, ఆయిల్‌లను ట్రై చేసి విసిగిపోతూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో మొండి సమస్యగా ఉన్న చుండ్రు లేదా డాండ్రఫ్ నివారణకు చక్కటి ఉపాయం చెప్పడం జరిగింది. ఆయుర్వేదంలో వివరించిన విధంగా చేస్తే మాత్రం చుండ్రు సమస్య నుంచి విముక్తి లభించడంతో పాటు శాశ్వత పరిష్కారం పొందవచ్చు.
ఆయుర్వేదంలో చుండ్రు లేదా డాండ్రఫ్ నివారణకు చక్కటి తైలాన్ని తయారు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ తైలాన్ని పారిజాతం గింజలు, వేపాకు, అతిమధురం, కరక్కాయ, ఉసిరికాయ, కొబ్బరినూనెలతో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ తైలాన్ని తయారు చేసుకోవడానికి ముందు ఇప్పటి వరకు చెప్పిన అన్ని వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
తైలాన్ని తయారు చేసే విధానం ఇదే
- ముందుగా స్టవ్ వెలిగించి, దానిపై పాత్ర పెట్టుకోవాలి
- అందులో 2లీటర్ల నీళ్లు పోసి, దానిలోనే 200గ్రాముల కొబ్బరి నూనె వేసుకోవాలి
- ఈ మిశ్రమం బాగా మరుగుతున్నప్పుడు ఎండిపోయిన ఉసిరికాయ చూర్ణాన్ని 50గ్రాములు వేసుకోవాలి.
- అందులోనే కరక్కాయ చూర్ణాన్ని 50గ్రాములు వేసుకోవాలి.
- ముందుగా సిద్ధం చేసుకున్న వేపాకు చూర్ణం 50గ్రాములు కలుపుకోవాలి.
- ఇందులోకి అతిమధురం చూర్ణాన్ని 50గ్రాముల పరిమాణంలో వెయ్యాలి.
- అలాగే పారిజాతం ఎండిన గింజల చూర్ణాన్ని 50గ్రాములు వేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని నీరు ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి.
- నీరు పూర్తిగా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలిన తర్వాత ఈ తైలాన్ని వడగట్టుకోవాలి.
తైలం వాడే విధానం : నిల్వ ఉంచుకున్న ఈ తైలాన్ని ముందు రోజు రాత్రి బాగా తైలంతో మర్దనా చేసుకోవాలి. లేదంటే కనీసం ఒకటి రెండు గంటల ముందు అయినా అంటించుకోవడం వల్ల చుండ్రు లేదా డాండ్రఫ్ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు డా.గాయత్రీ దేవి సూచిస్తున్నారు.
తైలం వల్ల ప్రయోజనాలు ఇవే
ఈ తైలాన్ని తయారు చేసుకోవడానికి వాడిన ప్రతి వస్తువు మన వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ఔషధాలు. ఉసిరికాయ వల్ల మన వెంట్రుకలు మృదువుగా అవడంతో పాటు మాడు మీద పొట్టు రాకుండా ఉంటుంది. అలాగే కరక్కాయ జిడ్డుతనం రాకుండా చేస్తుంది. ఇక వేపాకు చేదు గుణం మేలు చేయడంతో పాటు జిడ్డు రాకుండా, మాడు మీద మంచి ప్రభావం చూపుతుంది. అతిమధురం వల్ల చుండ్రు తగ్గడంతో పాటు జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. పారిజాతం గింజలు చుండ్రు నివారణకు అద్భుతమైన ఔషధంగా చెప్పుకోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? - ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి!