Ayurveda Home Remedie for Allergy: ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా అలర్జీతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు ఇలాంటి అలర్జీలతో ఎక్కువగా బాధ పడుతున్నారు. చెత్తాచెదారంతో వచ్చే కాలుష్యం, భవన నిర్మాణ కాలుష్యంతో ఎక్కువగా అలర్జీ సమస్యలు వస్తున్నాయి. పైగా వర్షాకాలంలో ఈ అలర్జీలు మరింత ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ సమస్యను తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, దీనికి ఆయుర్వేదంలో మంచి పరిష్కార మార్గం ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ. మరి ఈ పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- 30 గ్రాముల పసుపు
- 60 గ్రాముల సోంపు చూర్ణం
- 60 గ్రాముల ధనియాలు
- 10 గ్రాముల శొంఠి
- 10 గ్రాముల మిరియాల పొడి
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో పసుపు, సోంపు చూర్ణం, ధనియాల పొడిని వేసుకోవాలి.
- ఆ తర్వాత శొంఠిని కాస్త నేతిలో వేడి చేసుకుని చూర్ణం లాగా చేసుకోని పైన పొడులలో కలుపుకోవాలి.
- అనంతరం మిరియాల పొడిని వేసుకుని బాగా కలిపితే ఔషధం రెడీ.
- దీనిని ప్రతిరోజు వంట చేసే సమయంలో కూరల్లో మసాలాగా వాడుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మసాలాలాగా చెంచా నెయ్యితో వేయించిన తర్వాత కూరలో కలపాలి.
- ఆ తర్వాత అన్నంతో కలుపుకొని తినాలని సూచించారు. ఇందులో ఉన్న పదార్థాలు ధనియాలు, మిరియాలు, శొంఠి మంచి ఔషధాలు కావడం వల్ల అలర్జీలు తగ్గిపోతాయని వివరిస్తున్నారు.
పసుపు: పసుపును మనలో చాలా మంది యాంటిబయాటిక్‌గా వాడుతుంటారు. ఇది అలర్జీలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పారు. వేడి పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగినా.. అలర్జీలు తగ్గుతాయని వివరిస్తున్నారు.
సోంపు: మన అందరి ఇంట్లో సోంపు సులభంగా లభ్యమవుతుంది. ఇది కూడా అలర్జీ తగ్గడానికి ఉపయోగపడే మంచి ఔషధమని వైద్యులు చెబుతున్నారు.
ధనియాలు: ధనియాలు అందరి ఇళ్లలో ఉండే మసాలా దినుసు. ప్రతి కూరలోనూ ధనియాల పొడిని వాడుతుంటారు. ఇది అలర్జీని తగ్గించడంలో ఎంతో బాగా సహాయం చేస్తుందని వివరిస్తున్నారు.
శొంఠి: అలర్జీతో పాటు కఫాన్ని తగ్గించడానికి శొంఠి ఎంతో బాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.