Suresh Gopi Media : మాలీవుడ్ నటీనటులు, దర్శకులపై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై, అలాగే సినీ పరిశ్రమపై ప్రజల అభిప్రాయాన్ని మీడియా తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపి మండిపడ్డారు. ఇదంతా మీడియాకు 'ఆహారం' లాంటిందని ఆయన అన్నారు.
"ఇదంతా మీకు ఆహారం లాంటింది. మీరు డబ్బు సంపాదించడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ ఈ సమస్యలు కోర్టులో ఉన్నాయి. మీరు (మీడియా) మీ స్వలాభాల కోసం ప్రజలను ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేయడమే కాదు, ప్రజల అవగాహనను తప్పుదారి పట్టిస్తున్నారు. ఫిర్యాదులు ప్రస్తుతం ఆరోపణల రూపంలో ఉన్నాయి. ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కోర్టా? ఈ విషయాన్ని మీరు కాదు కోర్టు నిర్ణయిస్తుంది" అని గోపి అన్నారు.
2017లో ఓ మలయాళ నటిపై దాడి జరిగిందంటూ కేసు నమోదైంది. దీనిపై సమగ్ర నివేదిక కోసం కేరళ ప్రభుత్వం అప్పట్లో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గరించి ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ నుంచి తను ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానంటూ నటి రేవతి సంపత్ ఆరోపించారు. ఆ తర్వాత. ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్ చలచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ కూడా మీడియాతో పేర్కొన్నారు. ఈ విషయాలపై మీడియాలో వస్తున్న కథనాలపై గురించి కేంద్రమంత్రి సురేశ్ గోపీ ఈ మేరకు స్పందించారు.
ఫోన్ స్క్రోల్ చేయాలన్నా భయమేస్తోంది
మరోవైపు ఈ హేమా కమిటీ రిపోర్ట్ గురించి తాజాగా హీరో నాని స్పందించారు. తాజాగా తన అప్కమింగ్ మూవీ ఈవెంట్లో ఆయన ఈ విషయం గురించి ప్రస్తావించారు.
"హేమ కమిటీ నివేదికను చూసి నేను షాకయ్యాను. మహిళలపై లైంగిక వేధింపులను చూస్తుంటే మనం ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో బతుకున్నామా అనిపిస్తోంది. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ ఘటన కూడా నన్ను తీవ్రంగా కలచివేసింది. గతంలో జరిగిన నిర్భయ ఘటన బాధ కూడా నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. వాస్తవానికి నేను ఫోన్‌ను స్క్రోల్ చేయడానికి కూడా భయపడుతున్నాను. సోషల్ మీడియాను మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అయితే మితిమీరిన వాడకం మాత్రం ఎప్పటికైనా ప్రమాదమే. మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల గురించి విన్నప్పుడల్లా వాటి నుంచి మనం ఏమాత్రం బయటకు రాలేకపోతున్నా. 20 ఏళ్ల క్రితం పరిస్థితులు ఇప్పటికంటే పూర్తి భిన్నంగా ఉండేవి. అప్పటి రోజుల్లో మహిళలకు కాస్త రక్షణ ఉండేది. అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి" అని నాని అన్నారు.