Squid Game Copy Allegations : తన సినిమా కథను కాపీ కొట్టి పాపులర్ కొరియన్ డ్రామా 'స్క్విడ్ గేమ్'ను తెరకెక్కించారని తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని కథ, అలాగే ఈ సిరీస్‌లో చూపించిన కథ ఒకటేనంటూ చెప్పుకొచ్చిన ఆయన, ఈ విషయంలో తనకు నష్టపరిహారం అందించాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్, అలాగే సిరీస్ రచయిత హ్వాంగ్ డాంగ్ హ్యుక్‌పై తాజాగా దావా వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సోహమ్ షా రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'లక్'. సంజయ్ దత్, మిథున్ చక్రవర్తి, ఇమ్రాన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రుతిహాసన్ ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే 2009లో వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.
అయితే ఇప్పుడు ఈ సినిమానే కాపీ కొట్టి 'స్క్విడ్ గేమ్'ను తెరకెక్కించారంటూ సోహమ్ షా తాజాగా న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఆయన దావా వేశారు. అంతేకాకుండా ఈ సిరీస్‌ను వెంటనే స్ట్రీమింగ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించాలని కోరారు.
ఇదిలా ఉండగా, డైరెక్టర్ ఆరోపణల గురించి నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్పందించింది. ఆ డైరెక్ట్ చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందులో ఎటువంటి నిజాలు లేవంటూ పేర్కొంది. ఈ కథను రాసింది, డైరెక్ట్ వహించింది హ్వాంగ్ డాంగ్ హ్యుక్ మాత్రమేనంటూ తెలిపింది.
స్టోరీ ఏంటంటే :
లైఫ్‌లో అన్నీ కోల్పోయి, అప్పుల పాలైన ఓ 456 మందిని ఒక సీక్రెల్ ఐలాండ్ (దీవి)కి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి ఆటల పోటీలను నిర్వహిస్తారు. ఇటువంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. అలా ఆడిన తర్వాత వచ్చే చివరిదే ఈ 'స్క్విడ్ గేమ్'.
ఈ ఆరింటిలోనూ గెలిచిన వారు భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చు. అయితే, ఈ గేమ్స్‌లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ అనే పేరు చెప్పి చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా సాగే ఈ సిరీస్ సౌత్ కొరియాలోనే కాకుండా యావత్ సినీ లవర్స్ నుంచి విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి కంటిన్యూయేషన్‌గా 'స్క్విడ్ గేమ్ 2' తెరకెక్కుతోంది. డిసెంబర్‌లో ఇది స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
అయితే 'లక్'లోనూ ఇంచుమించు ఇదే కథ ఉంటుంది. అప్పులపాలైన కొంతమంది భారీ మొత్తంలో వచ్చే ప్రైజ్ మనీ కోసం కొన్ని గేమ్స్‌లో పాల్గొంటారు. 2009లో ఈ సినిమా విడుదలైంది. అదే ఏడాదిలోనే తాను స్క్విడ్ గేమ్ కథ రాసుకున్నానంటూ డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యుక్ కూడా గతంలో చెప్పారు.