Premalu Movie Review: సినిమా: ప్రేమలు; నటీనటులు: నస్లేన్ కె. గఫూర్, మాథ్యూ థామస్, మమిత బైజు, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు; దర్శకత్వం: గిరీష్ ఎ.డి; సంగీతం: విష్ణు విజయ్; నిర్మాత: ఫహద్ ఫాజిల్, సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు; ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్ వర్గీస్; దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్; రచన: గిరీష్ ఎ.డి., కిరణ్ జోసో; విడుదల తేదీ: 08-03-2024.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు పెద్ద విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా ప్రేమలు అనే సినిమా కూడా ఇదే ఫలితాన్ని రిపీట్ చేసింది. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను మార్చి 8న రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం?
కథేంటంటే: సచిన్ సంతోష్ (నాస్లెన్ కె.గఫూర్) ఓ గ్రాడ్యుయేట్. చదువుకునే రోజుల్లో కాలేజీలో ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ, తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు అతడికి ధైర్యం సరిపోదు. అయితే కాలేజీ లాస్ట్ రోజు తన ప్రేమ విషయం అమ్మాయికి చెప్తాడు. అయితే అప్పటికే ఆ అమ్మాయి వేరొకరితో ప్రేమలో ఉన్నానని చెప్తుంది. అలా తొలిసారి ప్రేమలో విఫలమైన సచిన్ యూకే వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ, అతడికి వీసా రాదు. దీంతో ఫ్రెండ్ సహాయంతో కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడే రీనూ (మమిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లిలో వీరిద్దరూ కలుస్తారు. ఇక మళ్లీ ప్రేమలో పడిపోతాడు. మరి ఫస్ట్ లవ్ ఫెయిలైన సచిన్ ఈసారైనా ప్రేమలో గెలుస్తాడా? అనేది సినిమా.
ఎలా ఉందంటే: లవ్ ట్రాక్ కీలకంగా సాగే మూవీలో పెద్దగా స్టోరీ ఆశించలేం. అబ్బాయి- అమ్మాయి ప్రేమ వ్యవహారంతోనే కథ సాగిపోతూ ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా పెద్దగా ఉండవు. నేచురల్‌గా స్టోరీని ప్రజెంట్ చేస్తూ, కాస్త కామెడీ టచ్ ఇచ్చాడు. కొంచెం కాలేజీ క్యాంపస్, ఇంకొంచెం కార్పొరేట్ ఆఫీస్‌లోని వాతావరణం, బ్యాచిలర్ రూమ్‌ల్లో యువకుల జీవితాలు, ఆయా కుటుంబాల నేపథ్యాలు ఇలా అన్నీ నేచురల్‌గా ఉన్నాయి. దీంతో అక్కడే ప్రేక్షకులకు సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
అన్ని పాత్రలతో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సినిమా తెరకెక్కించారు. సినిమాలో పెద్దగా స్టోరీయే లేదు అనే ఆలోచన ప్రేక్షకుడికి రాకుండా కామెడీతో కవర్ చేశాడు. హీరో ప్రపంచాన్ని చూపిస్తూ సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు, అసలు కథను ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఇక హీరో హీరోయిన్లు పెళ్లిలో కలుసుకున్నాకే అసలు హంగామా మొదలవుతుంది.
వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలయ్యాక రీనూ మేనేజర్ ఆది పడే పాట్లు, అతడి ఆఫీస్‌లోని స్టాఫ్ చేసే అల్లరి, ప్రారంభం నుంచి హీరోకి ఎదురయ్యే సమస్యలు సినిమాను హాస్యభరితంగా మారుస్తాయి. హైదరాబాద్‌లో టూర్లు, పార్టీలు అంటూ అవే సీన్స్ రిపీట్ అవుతాయి. తెలుగులో ట్రెండీగా సంభాషణలు కుదిరాయి. రీసెంట్ బ్లాక్‌బస్టర్ వెబ్‌సిరీస్ '#90'S దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ మూవీకి మాటలు అందించారు. అది ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. కుర్చీని మడతపెట్టి డైలాగ్ నుంచి కుమారి ఆంటీ వరకూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయాల్ని ఇందులో చూపించి కామెడీ పండించారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.
బలాలు
- హాస్యం
- కథా నేపథ్యం
- నటీనటులు
బలహీనతలు
- సాగదీతగా కొన్ని సన్నివేశాలు
చివరిగా: ప‌్రేమలు భలే నవ్వులు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">