Miss Teen Universe 2024 Trishna Ray : అంతర్జాతీయ అందాల పోటీల వేదికపై మరోసారి భారతీయ అందం మెరిసింది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ వేదికగా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 పోటీల్లో భారతీయ విద్యార్థిని కిరీటాన్ని దక్కిచుకుంది. ఈ పోటీల్లో భారత్ అమ్మాయి విజేతగా నిలవడం ఇదే తొలి సారి కావడం విశేషం! నవంబరు 1 నుంచి 9 వరకు జరిగిన ఈ అందాల్లో పోటీల్లో ఒడిశాకు చెందిన తృష్ణా రే విజేతగా నిలిచిందన పోటీ నిర్వాహకులు అధికారిక ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఏఏ దేశాలు పాల్గొన్నాయంటే? - ఈ ఏడాది మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు చెందిన తృష్ణా రే ముద్దాడింది. రీసెంట్‌గానే దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలు జరగగా, ఈ పోటీల్లో పెరూ, సౌతాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నమీబియా, నెదర్లాండ్స్ సహా వివిధ దేశాలకు చెందిన మోడళ్లు పోటీల్లో పాల్గొని సందడి చేశారు. వీరందరినీ వెనక్కి నెట్టి మిస్ టీన్ యూనివర్స్ అందాల కిరీటాన్ని 19 ఏళ్ల తృష్ణా రే సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. పెరూకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ప్రెషియస్ ఆండ్రీలు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.
తృష్ణా రే ఎవరంటే? - తృష్ణా రే కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రేల ముద్దుల కుమార్తె. తృష్ణ రే తండ్రి ఇండియన్ ఆర్మీ అధికారి కల్నల్. తృష్ణా ది ఒడిశా రాష్ట్రం . ప్రస్తుతం ఈ భామ భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. ఇకపోతే ఈ పోటీలకు సంబంధించిన వీడియోను నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలానే ఈమె విజయానికి సంబంధించిన విషయాలను కేఐఐటీ ఇన్‌స్టిట్యూట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఈమె గెలుపు దేశానికి గర్వకారణమని పేర్కొంది. ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకురాలు డా.అచ్యుత సమంత కూడా తృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.