Kalki Bollywood Boxoffice: బాలీవుడ్ ఇండస్ట్రీ మంచి హిట్ సినిమా చూసి చాలా కాలమైంది. వరుస వైఫల్యాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. అలా నిరాశలో ఉన్న బాలీవుడ్‌కు 'కల్కి 2898 AD' హిందీ వెర్షన్ ఇండస్ట్రీలో లాభాలు చూపింది. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన 'బడే మియాన్ చోటే మియాన్', 'మైదాన్', 'యోధ' వంటి భారీ బడ్జెట్ మూవీలు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. హిందీ సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ గత ఆరు నెలల్లో వ్యాపారంలో 20-30% క్షీణించింది. 'లాపతా లేడీస్' (రూ.20 కోట్లు), ముంజ్యా (రూ.98 కోట్లు) వంటి చిన్న సినిమాలు కొంత ప్రభావం చూపాయి. కానీ మొత్తం పరిశ్రమను నష్టాలను పూడ్చలేకపోయాయి.
ఆదుకున్న కల్కి!: 'కల్కి రాకపోయి ఉంటే 2024 మొదటి ఆరు నెలల ఫలితాలు దారుణంగా ఉన్నాయని చెప్పేవాడిని. కల్కి బాలీవుడ్ సినిమా కానప్పటికీ, హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో కొత్త కళను తీసుకొచ్చింది. కల్కి మా రిపోర్ట్ కార్డ్‌ని మెరుగుపరచడానికి వచ్చింది. లేకుంటే రిపోర్ట్ కార్డ్ నెగెటివ్‌లోనే ఉండేది' అని ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహ్తా అన్నారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటించిన కల్కి మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పాన్ఇండియా లెవల్‌లో ఈ మూవీ ఇప్పటికే రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.
Total 13 Days North India (Hindi) #Kalki2898AD Nett Will be around 230cr+ (NBOC)
— Prabhas Fan (@ivdsai) July 10, 2024
Kalki 2898 AD is All set to Cross #RRR's FInal Run (274cr~ Nett) in Hindi Belt. #AmitabhBachchan #KamalHaasan #Prabhas #DeepikaPadukone #DishaPatani #NagAshwin #EpicBlockbusterKalki2898AD pic.twitter.com/LHJp9SCjSX
ఈ ఏడాది బాలీవుడ్ ఫ్లాప్ సినిమాలు
- మైదాన్: రూ.235 కోట్లతో రూపొందిస్తే, కేవలం రూ.63 కోట్లు వసూళ్లు చేసింది.
- బడే మియాన్ చోటే మియాన్: రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగ, రూ.110 కోట్లు మాత్రమే సంపాదించింది.
- యోధ: రూ.55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, రూ.42 కోట్లు వసూలు చేసింది.
- సైతాన్: రూ.147 కోట్లు సంపాదించింది.
ఓ మోస్తరు హిట్లు!
ఈ ఏడాది రిలీజైన కొన్ని సినిమాలు మోస్తరు లాభాలు అందుకున్నాయి. పెట్టుబడిని తిరిగి రాబట్టడంలో విజయం సాధించాయి.
- ఫైటర్: రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించింది.
- తేరి బాతోన్ మే ఐసా ఉల్జా జియా రూ.75 కోట్ల బడ్జెట్ అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ.139 కోట్లు ఆర్జించింది.
- ఆర్టికల్ 370: రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే, రూ.105 కోట్లు సంపాదించింది.
- క్రూ: రూ.96 కోట్లు వసూలు చేసింది.
- చందు ఛాంపియన్: రూ.73 కోట్లు వసూలు చేసింది.
ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లు: 'గత సంవత్సరంతో పోలిస్తే వ్యాపారం కనీసం 20 నుంచి 25 శాతం తగ్గింది. ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు' అని నహ్తా పేర్కొన్నారు. ముంబయి ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్, జైపూర్ డిస్ట్రిబ్యూటర్ రాజ్ బన్సల్ అంచనా ప్రకారం, వ్యాపారం 2023 కంటే 50-60% తక్కువగా ఉంది. ఓర్మాక్స్ మీడియా ప్రకారం, హిందీ సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు రూ.1,443 కోట్ల (2023 జనవరి-మే ) నుంచి రూ.1,251 కోట్లకు (2024 జనవరి-మే) పడిపోయాయి.
బిజినెస్ పడిపోవడానికి కారణాలు: దేశాయ్ ఈ సమయాన్ని ఎగ్జిబిషన్ ఇండస్ట్రీకి వరస్ట్‌గా ఉందని అభివర్ణించారు. '2024 మాకు చాలా బ్యాడ్‌గా ఉంది. గతేడాది 'పఠాన్', 'గదర్- 2' వంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ పెద్దగా వర్కౌట్ కాలేదు' అన్నారు. బన్సాల్, చెన్నైకి చెందిన ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా మాట్లాడుతూ, బలహీనమైన కంటెంట్, సంగీతంపై తక్కువ దృష్టి పెట్టడం, అధిక టిక్కెట్ ధరలు బిజినెస్ తగ్గడానికి కారణమని చెప్పారు. ప్రేక్షకులు ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? 'స్త్రీ 2', 'వేద', 'సింగం 3', 'బేబీ జాన్', 'పుష్ప 2', 'దేవర' వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 2024 ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్, అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', హృతిక్ రోషన్ 'వార్ 2' వంటి పెద్ద సినిమాలు 2025లో వస్తాయని, కొత్త సంవత్సరం అనుకూలంగా ఉంటుందని దేశాయ్, బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు.