Dhanush Raayan Movie Review: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా 'రాయన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆయన కెరీర్లో 50వ చిత్రం. ఈ సినిమా శుక్రవారం (జులై 26) గ్రాండ్‌గా రిలీజైంది. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
కథేంటంటే: హీరో రాయన్ (ధనుష్) ఈ సినిమాలో ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడికి ఇద్దరు తమ్ముళ్లు (కాళిదాస్ జయరామ్, సందీప్‌కిషన్), ఒక చెల్లి (దుషారా విజయన్). చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమవుతారు. టౌన్‌కి వెళ్లి వస్తామని చెప్పి మళ్లీ తిరిగిరారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు రాయన్ చేత కత్తి పట్టిస్తాయి. దీంతో రాయన్‌కు అప్పట్నుంచే భయపడకుండా పోరాటం చేయడం అలవాటవుతుంది. తన తోబుట్టువులకు అన్నీ తానై వ్యవహరిస్తాడు.
వారిని వెంటబెట్టుకొని టౌన్‌కు చేరుకుంటాడు. అక్క ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురూ అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడ దురై (శరవణన్), సేతు (ఎస్.జె.సూర్య) గ్యాంగ్స్ మధ్య ఎప్పట్నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతుంటుంది. ఆ గొడవలు రాయన్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన తమ్ముళ్లు, చెల్లెలు కోసం రాయన్ ఏం చేశాడు? రాయన్ కోసం వాళ్లు ఏం చేశారు? మిగిలిన విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే: ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ కథలు, అందులో ఉండే పాత్రల మధ్య సంఘర్షణ సినిమా విజయానికి కొలమానంగా నిలుస్తాయి. కథ పరంగా 'రాయన్'లో కొత్తదనం లేకపోయినా, కొన్ని మలుపులు, కుటుంబ డ్రామా, కథా నేపథ్యంతో కాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో చాలా సమయం క్యారెక్టర్ల పరిచయానికే సరిపోయింది. అయితే రాయన్ ఫ్యామిలీకి దురై గ్యాంగ్ నుంచి సవాలు ఎదురు కావడం నుంచే అసలు కథ మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తూ, సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది.
దురైతో పోరాటం తర్వాత బలంగా కనిపించిన రాయన్, ఆ తర్వాత తోడేల్లాంటి సేతు (ఎస్.జె.సూర్య) ఎత్తులకు దొరికిపోయాడా? లేదా?అనే విషయాలు ఆసక్తికరం. ఫస్ట్ హాఫ్‌లో అన్నదమ్ముల స్టోరీ అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కథ పూర్తిగా టర్న్ తీసుకుంటుంది. రాయన్- తన చెల్లెలు మధ్య జరిగే సీన్స్ హైలైట్. ముఖ్యంగా సేతు మనిషిని ఇంటికి పిలిపించి చంపి, టీ తాగడం తదితర సన్నివేశాలు ప్రేక్షకులలతో ఈలలు కొట్టిస్తాయి. సేతు, తన ఇద్దరు పెళ్లాల చుట్టూ అల్లిన సన్నివేశాలూ అలరిస్తాయి.
ఎవరెలా చేశారంటే: ధనుష్ నటన ఈ సినిమాకి ప్రధాన బలం. అండర్ ప్లే చేస్తూనే హీరోయిజం ప్రదర్శించిన తీరు ఈ కథను మార్చేసింది. ద్వితీయార్ధంలో తనలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో కూడా చాటి చెబుతాడు. సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్ తమ్ముళ్లుగా ఆకట్టుకున్నారు. దుషారా విజయన్ పాత్ర, ఆమె నటన చిత్రానికి ప్రధానబలం. ఎస్.జె.సూర్య విలన్‌గా భయపెడుతూనే చాలా చోట్ల నవ్వించాడు. శరవణన్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్‌రాజ్, వరలక్ష్మి శరత్‌కుమర్‌ల పాత్రల పరిధి తక్కువే అయినా గుర్తుండిపోతాయి. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. దర్శకుడిగా కంటే ధనుష్‌కి నటుడిగానే ఎక్కువ మార్కులు పడతాయి.
బలాలు
- ధనుష్ నటన
- ద్వితీయార్థంలో మలుపులు, డ్రామా
- నేపథ్య సంగీతం
బలహీనతలు
- ప్రథమార్ధం
- కొరవడిన భావోద్వేగాలు
చివరిగా: రాయన్ ఇది ధనుష్ షో
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!