Balakrishna 50 Years Tatamma Kala : పాత్ర ఏదైనా, కథ ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయి నూటికి నూరుశాతం నిబద్ధతను చాటే అతి కొద్దిమంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆరు పదుల వయసులోనూ యువ కథానాయకులకు దీటుగా సినిమాలు చేస్తున్నారు.
అయితే తాజాగా బాలకృష్ణ తన వెండితెర ప్రయాణంలో 50 ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం 'తాతమ్మ కల' 1974 ఆగస్టు 30న విడుదలైంది. పద్నాలుగేళ్ల వయసులో ఈ తాతమ్మ కల చిత్రంతోనే వెండితెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ.
నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో 'తాతమ్మ కల' కూడా ఒకటి. అయితే ఇది నటసింహం బాలకృష్ణకు బాల నటుడిగా తొలి సినిమా కావడం విశేషం. అప్పటి ప్రభుత్వ ఆలోచనా ధోరణికి భిన్నమైన కథాంశంతో రూపొందింది. ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది.
ఆ రోజుల్లో ఈ తాతమ్మ కల విడుదలకు ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. రెండు నెలల పాటు నిషేధానికి కూడా గురైంది. 1974లో ఈ చిత్రం మొదలయ్యే సరికి కుటుంబ నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న రోజులవి. అలాంటి సమయంలోనే 'ఇద్దరు ముద్దు ఆపై వద్దు' అనే ప్రభుత్వ నినాదానికి వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎన్టీఆర్.
ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ పరిమిత సంతానానికి వ్యతిరేకం. సంతానం ఎంత మంది ఉండాలి అనేది తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి కానీ, ఇంకెవరికీ ఆ హక్కు ఉండదని చెప్పేవారు. అందుకే ఈ అంశాన్ని ఆధారం ఎన్టీఆర్ ఓ కథ స్వయంగా రాసుకున్నారు. దాన్ని రచయిత డి.వి నరసరాజుకు ఇవ్వగా, ఆయన శక్తిమంతమైన సంభాషణలతో స్క్రిప్ట్ రెడీ చేశారు.
దీంతో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే ద్విపాత్రాభినయం చేస్తూ రూపొందించారు. కథలో మనవడి పాత్రకు పుట్టిన ఐదుగురు పిల్లలు సామాజికంగా రోజూ చూస్తున్న ఐదు ప్రధాన సమస్యలకు పరిష్కార ప్రతినిధులుగా ఉంటారు. వీటిలో 'తాతమ్మ కల' నెరవేర్చే మునిమనవడిగా బాలకృష్ణ కనిపించారు. వ్యసనపరుడిగా హరికృష్ణ నటించారు.
సినిమా రాజబాబు, రమణారెడ్డి, రోజారమణి, కాంచన తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ ఎంతో వేగంగా పూర్తి చేసుకున్నప్పటికీ అప్పటి పరిస్థితుల వల్ల కథ పరంగా సెన్సార్ అడ్డంకులు బాగా ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంపై రెండు నెలల పాటు నిషేధం విధించారు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చలు జరిగినట్లు ఎన్టీఆర్ అప్పట్లో గొప్పగా చెప్పేవారు! ఏది ఏమైనా ఎన్టీఆర్ పట్టుదలతో ఆ అడ్డంకులన్నీ దాటి 1974 ఆగస్టు 30న తాతమ్మ కల విడుదలైంది. ఈ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా ఎన్టీఆర్‌కు నంది అవార్డు కూడా వరించింది.
జై బాలయ్య - స్వర్ణోత్సవ నట రాజసం - Balakrishna 50 years
'రోజుకో 'NTR' సినిమా- కబడ్డీ టీమ్ కెప్టెన్'- బాలయ్య లైఫ్‌స్టైల్! - Balakrishna 50 Years