Google AI Courses For Free : ఇది హైటెక్ యుగం. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ హవా నడుస్తోంది. దీనికి సంబంధించిన స్కిల్స్ కలిగిన వారికి మార్కెట్లో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్, మీడియా సహా చాలా రంగాలు ఇప్పుడు వాటికిి అవసరమైన రీతిలో ఏఐను వాడేస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీ గూగుల్ పూర్తి ఉచితంగా 10 ఏఐ కోర్సులను అందిస్తోంది. ఆ కోర్సులు ఏమిటి ? వాటిలో ఎలా జాయిన్ కావాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. జనరేటివ్ ఏఐ ఇంట్రడక్షన్ కోర్సు
ఈ కోర్సులో జనరేటివ్ ఏఐ(Gen AI) అంటే ఏమిటి? ఏఐ టెక్నాలజీలో అది ఎలా ఉపయోగపడుతుంది? సాంప్రదాయిక మెషీన్ లెర్నింగ్ పద్ధతులకు ఇది ఎంత భిన్నమైంది? అనే అంశాలను నేర్పిస్తారు. గూగుల్ టూల్స్‌ను వాడుకొని సొంతంగా జనరేటివ్ ఏఐ యాప్‌లను ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా చెబుతారు. బాగా శ్రద్ధ పెడితే ఈ బేసిక్ ఆన్‌లైన్ కోర్సు పూర్తి కావడానికి 45 నిమిషాల సమయమే పడుతుంది
2. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇంట్రడక్షన్ కోర్స్
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను సంక్షిప్తంగా LLM అంటారు. ఏఐ టెక్నాలజీలో వీటిని ఎందుకు వాడుతారు? ఏయే సందర్భాల్లో వాడుతారు? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పనితీరును మెరుగుపర్చడానికి మీరు ప్రాంప్ట్ ట్యూనింగ్‌ను ఎలా ఉపయోగించచ్చు ? అనేది ఈ కోర్సులో నేర్పిస్తారు. గూగుల్ టూల్స్‌ను వాడుకొని సొంతంగా జనరేటివ్ ఏఐ యాప్‌లను ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా ఇందులోనూ బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి కావడానికి కూడా 45 నిమిషాలే పడుతుంది.
3. రెస్పాన్సిబుల్ ఏఐ ఇంట్రడక్షన్ కోర్సు
గూగుల్ ఏఐ ప్రొడక్ట్స్‌లో రెస్పాన్సిబుల్ ఏఐను వాడుతుంటారు. ఏఐ టెక్నాలజీలో దీని వినియోగం ఎలా ఉంటుంది ? ఇది ఎలా పనిచేస్తుంది? అనే వివరాలను ఈ కోర్సులో బోధిస్తారు. గూగుల్ అనుసరించే 7 ఏఐ సూత్రాలను ఈ కోర్సులో భాగంగా నేర్పిస్తారు.
4. జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సు
జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సులో జనరేటివ్ ఏఐకి సంబంధించిన బేసిక్స్‌ను నేర్పిస్తారు. దీనితో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రెస్పాన్సిబుల్ ఏఐలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని బోధిస్తారు. ఇవన్నీ నేర్చుకున్నాక, స్కిల్ బ్యాడ్జ్‌ను అందిస్తారు. ఈ కోర్సు చివర్లో నిర్వహించే క్విజ్‌లో వచ్చే స్కోరును బట్టి జనరేటివ్ ఏఐపై మీకు వచ్చిన అవగాహనా స్థాయిపై ఒక అంచనాకు రావచ్చు.
5. ఇమేజ్ జనరేషన్‌పై ఇంట్రడక్షన్ కోర్సు
ఏఐ టెక్నాలజీ ద్వారా ఇమేజ్ జనరేషన్‌పై ఈ కోర్సులో స్కిల్స్ నేర్పిస్తారు. వివిధ రకాల ఇమేజ్ జనరేషన్ మోడల్స్‌ను మీకు పరిచయం చేస్తారు. ఇవి భౌతిక శాస్త్రం, థర్మోడైనమిక్స్ ఆధారంగా పనిచేస్తాయి. గూగుల్ క్లౌడ్‌లోని అత్యాధునిక ఇమేజ్ జనరేషన్ మోడల్‌లు, వాటికి సంబంధించిన టూల్స్ గురించి బోధిస్తారు. ఇమేజ్ జనరేషన్ మోడల్‌ల పనితీరు గురించి వివరిస్తారు. ఏఐ వర్క్ఫ్లోనకు సంబంధించిన వెర్టెక్స్ AIపై అవగాహన కల్పిస్తారు.
6. ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ కోర్సు
ఈ కోర్సులో మీకు ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ గురించి బోధిస్తారు. ఇది మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలో కీలకమైన భాగం. మెషిన్ ట్రాన్స్‌లేషన్, టెక్స్ట్ సారాంశం, ప్రశ్నలకు సమాధానమివ్వడం వంటి సీక్వెన్స్-టు-సీక్వెన్స్ టాస్క్‌లను రూపొందించేందుకు ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్‌ను వినియోగిస్తారు. దాన్ని ఎలా వినియోగించాలి? అనేది నేర్పిస్తారు. TensorFlow అనే ఓపెన్ సోర్స్ మెషీన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్‌ను వినియోగించడంపై మెలకువలు బోధిస్తారు.
7. అటెన్షన్ మెకానిజంపై కోర్సు
అటెన్షన్ మెకానిజం టెక్నాలజీని వాడుకొని ఇన్‌పుట్ సీక్వెన్స్‌లోని ఎంపిక చేసిన భాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా న్యూరల్ నెట్‌వర్క్‌లకు గైడెన్స్ ఇస్తారు. అటెన్షన్ మెకానిజం టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దాన్ని వాడుకొని అనువాదం ఎలా చేయిస్తారు? వచన సారాంశం ఎలా సాధిస్తారు? ప్రశ్న, సమాధానం ప్రక్రియలకు కమాండ్స్ ఎలా ఇస్తారు? అనేది ఈ కోర్సులో నేర్పిస్తారు.
8. ట్రాన్స్‌ఫార్మర్ మోడల్, బీఈఆర్టీ మోడల్ కోర్సు
ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్, బీఈఆర్టీ మోడల్ కోర్సులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్, బై డైరెక్షనల్ ఎన్‌కోడర్ రిప్రజెంటేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్‌లో భాగంగా ఉండే సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం గురించి వివరిస్తారు. ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్‌ను వాడుకొని బీఈఆర్టీ మోడల్‌ను ఎలా రూపొందించాలనేది నేర్పిస్తారు. బీఈఆర్టీ మోడల్‌ను ఏయే అవసరాలకు వినియోగిస్తారు? టెక్ట్స్ క్లాసిఫికేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ఇన్ఫరెన్స్ వంటి అవసరాలకు బీఈఆర్టీ మోడల్‌ను ఎలా వాడాలనేది ఈ కోర్సులో నేర్పిస్తారు.
9. ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్‌ల తయారీపై కోర్సు
ఏఐ టెక్నాలజీలో అత్యంత కీలకమైనవి ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్. వీటిని ఎలా సృష్టించాలనేది ఈ కోర్సులో నేర్పిస్తారు. ఎన్‌కోడర్ అండ్ డీకోడర్ వంటి ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్‌లోని విభిన్న భాగాల గురించి తెలియజేస్తారు. మనం రూపొందించే ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడం, మూల్యాంకనం చేయడంపై అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సు ముగిసే సమయానికి మీరు స్వతహాగా ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్‌లను తయారు చేయగలుగుతారు.
10. జనరేటివ్ ఏఐ స్టూడియోపై కోర్సు
జనరేటివ్ ఏఐ స్టూడియో గురించి ఈ కోర్సులో నేర్పిస్తారు. వెర్టెక్స్ ఏఐ ద్వారా మీరు రెడీ చేసిన ఏఐ మోడల్స్‌ను ప్రొటోటైప్ చేసేందుకు జనరేటివ్ ఏఐ స్టూడియో ఉపయోగపడుతుంది. అనంతరం ఈ ఎఫెక్టులను మీరు తయారు చేసే ఏఐ యాప్‌లలోకిి ప్రవేశపెట్టొచ్చు. జనరేటివ్ ఏఐ స్టూడియో పనితీరుపై డెమోలను ఈ కోర్సులో చూడొచ్చు. చివర్లో మీరు ఎంత నేర్చుకున్నారో చెక్ చేసుకునేందుకు ఒక క్విజ్ ఉంటుంది. ఔత్సాహిక అభ్యర్థులు ఈ కోర్సులను ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సులు పూర్తయ్యాక గూగుల్ క్లౌడ్ మీకు 'కంప్లీషన్ బ్యాడ్జ్'ని అందిస్తుంది. జనరేటివ్ AIలో మీకు ఉన్న నాలెడ్జ్‌కు ఈ బ్యాడ్జీ ప్రామాణికంగా నిలుస్తుంది.
మీకు కనుక ఈ కోర్సులు చేయాలని ఆసక్తి ఉంటే, https://www.cloudskillsboost.google/ వెబ్సైట్లోకి వెళ్లి, ఈ కోర్సులు నేర్చుకోవచ్చు.
ఫ్రీలాన్సర్‌గా పని చేయాలా? ఈ టాప్-10 వెబ్‌సైట్స్‌పై ఓ లుక్కేయండి! - Best Freelancing Sites