Zomato Swiggy Raise Platform Fee : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లైన జొమాటో, స్విగ్గీలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజును 20 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దిల్లీ, బెంగళూరు లాంటి బాగా డిమాండ్ ఉన్న నగరాల్లో, ఇకపై ప్లాట్‌ఫామ్ ఫీజుగా రూ.6 వసూలు చేయనున్నట్లు తెలిపాయి. ఇప్పటి వరకూ ఈ ఫీజు రూ.5గా ఉంది. అయితే స్విగ్గీ బెంగళూరులో తమ ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.7గా పేర్కొంది. రాయితీ తర్వాత దాన్ని రూ.6కు తగ్గించినట్లు తెలిపింది.
ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి!
జొమాటో, స్విగ్గీలు ఇలా ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచడం ఇది తొలిసారేమీ కాదు. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు ఈ తరహా ఫీజును 2023లోనే ప్రవేశపెట్టాయి. మొదట్లో రూ.2తో దీన్ని ప్రారంభించాయి. తరువాత క్రమంగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్‌లో జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును 25 శాతం పెంచి రూ.5 చేసింది. దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, లఖ్‌నవూ నగరాలకు ఈ పెంపును వర్తింపజేసింది. వేగవంతమైన డెలివరీ కోసం ప్రియారిటీ ఫీజు పేరిట జొమాటో ఓ ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఒక్కో ఆర్డర్‌పై పొందే ఆదాయాన్ని, మరింత పెంచుకోవడం కోసం ఫుడ్ డెలివరీ యాప్‌లు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీలదే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలోనే క్రమపద్ధతిలో ఫీజును పెంచుతూ, మార్కెట్ వర్గాల స్పందనను పసిగడుతున్నాయి. ఈ విధంగా తమ లాభాలను భారీగా పెంచుకుంటున్నాయి.
జొమాటో, స్విగ్గీలకు చెందిన క్విక్ కామర్స్ వేదికలైన బ్లింకిట్, ఇన్స్టామార్ట్లు కూడా హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట ఫీజులు వసూలు చేస్తున్నాయి. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై రూ.4, ఇన్‌స్టామార్ట్ రూ.5 వరకు వసూలు చేస్తున్నాయి. దేశరాజధాని నగరమైన దిల్లీలో ఈ ఛార్జీలు వరుసగా రూ.16, రూ.5గా ఉన్నాయి.
స్విగ్గీ ఈ జనవరిలో కొంత మంది కస్టమర్లకు ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10గా చూపించింది. కానీ వాస్తవంగా దాన్ని వసూలు చేయలేదు. రూ.5 రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించి, తుది బిల్లులో దానిని తగ్గించింది. ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే, ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు సర్జ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన బీబీనౌ కూడా రూ.99పైన విలువ చేసే ఆర్డర్లపై రూ.5 వరకు హ్యాండ్లింగ్ ఛార్జీలు వసూలు చేస్తోంది.
వర్షాకాలంలో ఉపయోగపడే టాప్-10 కార్ & బైక్ డ్రైవింగ్ టిప్స్ ఇవే! - Monsoon Driving Tips