What Is Spaving : మీరు బాగా షాపింగ్ చేస్తుంటారా? ఆఫర్స్, డీల్స్, డిస్కౌంట్స్ ఉంటే అస్సలు వదిలిపెట్టరా? అయితే మీరు స్పావింగ్ ట్రాప్‌లో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మార్కెటింగ్ నిపుణుల సూచనల మేరకు వ్యాపారులు, ఈ-కామర్స్ వెబ్సైట్లు ప్రజలను ఆకర్షించడానికి పలు కొత్తకొత్త మార్గాలను అనుసరిస్తూ ఉంటాయి. బిగ్ డీల్స్, ఫ్లాష్ డీల్స్, వన్ డే ఆఫర్, లిమిటెడ్ టైమ్ ఆఫర్, లైఫ్ టైమ్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్, ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ కాయిన్స్ - ఇలాంటి ఉత్తేజపరిచే ప్రకటనలు చేస్తుంటాయి. వీటిని చూసి, చాలా డబ్బు ఆదా అవుతుందనే భ్రమలో, అవసరం లేకపోయినా, అతిగా షాపింగ్ చేస్తాము. దీనినే స్పావింగ్ అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, పొదుపు చేస్తున్నామనే భ్రమలో, అతిగా ఖర్చు చేయడాన్నే స్పావింగ్ అని చెప్పుకోవచ్చు.
అవసరం లేకపోయినా కొంటాం
సాధారణంగా ఈ-కామర్స్ సైట్లు ఉచిత షిప్పింగ్ కోసం ఒక లిమిట్ ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మీరు కనీసం వెయ్యి రూపాయల వరకు షాపింగ్ చేసినట్లయితేనే, మీకు ఉచిత షిప్పింగ్ ఏర్పాటు చేస్తామని ఆఫర్ ఇస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మీకు అవసరం లేకపోయినా, బిల్లు రూ.1000 అవ్వాలని, మరికొన్ని వస్తువులు మీ కార్ట్‌లో యాడ్ చేసుకుంటారు. దీన్నే స్పావింగ్ అని అంటారు. అంటే మీకు అవసరం లేకపోయినా, అదనపు, అనవసరపు వస్తువులను కొంటారు. దీని వల్ల మీకు తెలియకుండానే మీ డబ్బు వృధా అవుతుంది.
ఈ స్పావింగ్ ట్రాప్‌లో పడినవాళ్లు, అనవసరపు ఖర్చులు అధికంగా చేస్తారు. ఫలితంగా వారి క్రెడిట్ కార్డ్‌పై అదనపు భారం పడుతుంది. కనుక ఇలాంటి మార్కెటింగ్ ట్రాప్‌లో పడకుండా మీరు జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బిగ్ ట్రాప్
స్పావింగ్ అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు "'ఒకటి కొనండి, ఒకటి ఉచితంగా పొందండి', 'భారీ డిస్కౌంట్ - నేడే సొంతం చేసుకోండి, ఫ్రీ షిప్పింగ్ మొదలైన ఆశలు చూపించి, మీచేత అనవసరమైన వస్తువులు కొనేలా చేస్తారు. అంతేకాదు దీనిలో చాలా మతలబులు కూడా ఉంటాయి. కొన్ని లిమిటెడ్ ఆఫర్లకు రిటర్న్ పాలసీ ఉండదు. అంటే కొన్న తరువాత ఆ వస్తువును రిటర్న్ చేసే అవకాశం ఇవ్వరు. అందవల్ల అది ఏమాత్రం బాగాలేకపోయినా, దానిని వెనక్కు పంపించలేరు. దీని వల్ల కూడా మీరు బాగా నష్టపోతారు.
స్పావింగ్ నుంచి ఎలా బయటపడాలి!
స్పావింగ్ ఉచ్చు నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీరు ఏం కొనుగోలు చేయాలని అనుకున్నారో, ఆ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి.
- మీరు కొనాలని అనుకుంటున్న వస్తువు ధర వివిధ వెబ్సైట్లలో ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. తక్కువ ధరకు అందించే దానిని ఎంచుకోవాలి.
- ఉచిత డెలివరీ కోసం అదనంగా ఇతర వస్తువులను కొనడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఖర్చులు పెంచుతుంది.
- మీ సమీపంలోని దుకాణాలలో మీకు కావాల్సిన వస్తువులు దొరుకుతున్నట్లయితే, వాటిని ఈ-కామర్స్ వెబ్సైట్లలో కొనవద్దు.
- అదనపు డిస్కౌంట్ వస్తుందనే ఆశతో, అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు.
- డిస్కౌంట్ల వెనుక ఉన్నటువంటి లెక్కలను జాగ్రత్తగా గమనించాలి.
- అప్పుడే మీరు ఈ స్పావింగ్ బారిన పడకుండా ఉంటారు. మీ జేబుకు చిల్లుపడకుండా జాగ్రత్త పడగలుగుతారు.
భవిష్యత్‌కు భరోసా కావాలా? ఈ టాప్-5 పెన్షన్ స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి! - Top 5 Pension Plans In India