Money Saving Tips : ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సుసంపన్న జీవితాన్ని కోరుకుంటారు. కానీ దాన్ని సాకారం చేసుకునే దిశగా సరైన నిర్ణయాలను సకాలంలో తీసుకోలేక విఫలమవుతుంటారు. జీవితానికి ఆర్థిక భద్రత లభించాలంటే తొలుత మనం స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇందుకోసం కొంచెంకొంచెంగా డబ్బును పొదుపు చేయడం ప్రారంభించాలి. నిత్యావసరాల ధరల మంట, లోన్ ఈఎంఐల భారం, అప్పులపై వడ్డీలు, పన్నుల మోత నడుమ డబ్బులను ప్రతినెలా పొదుపు చేయడం అంటే పెద్ద సవాలే. అయినా ఆర్థిక క్రమశిక్షణతో దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం అనుసరించాల్సిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఖర్చులపై పర్యవేక్షణ
తొలుత మీ నెలవారీ ఖర్చులను నిశితంగా పర్యవేక్షించాలి. ప్రతి చిన్న ఖర్చును కూడా నోట్ చేయాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ ఫార్మాట్‌లో సేవ్ చేసేందుకు కొన్ని బడ్జెట్ యాప్‌లు, స్ప్రెడ్‌షీట్‌లను మీరు వాడొచ్చు. లేదా పెన్ను, కాగితం వాడొచ్చు. మీకు జీతం పడే అకౌంటు నుంచి పొదుపు స్కీంలకు, పెట్టుబడి పథకాలకు డబ్బులు ప్రతినెలా ఆటోమేటిక్‌గా వెళ్లిపోయేలా బ్యాంకు ద్వారా ఏర్పాట్లు చేయించుకోవాలి. దీనివల్ల స్పష్టమైన డిజిటల్ పేమెంట్ రికార్డ్ అనేది బ్యాంకు వద్ద క్రియేట్ అవుతుంది. ‘మొదటి చెల్లింపు మీకే’ అనే ఈ వ్యూహాన్ని తప్పకుండా ఫాలోకావాలి. ప్రతినెలా స్థిరమైన పొదుపులు జరిగేలా చూసుకోవాలి.
2. వ్యూహాత్మకంగా ఖర్చులను తగ్గించుకోండి
ఖర్చులు రెండు రకాలు. అవి: అవసరం ఉన్నవి, అవసరం లేనివి. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, వైఫై బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి సామాన్లు, వైద్య వ్యయాలు వంటివి అవసరమైన ఖర్చులు. సినిమాలు, టూర్‌లు, అకాల షాపింగ్‌లు లాంటివి అనవసర ఖర్చులు. కనుక వీలైనంత వరకు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.
మీకు ప్రతినెలా వచ్చే ఆదాయాన్ని 50/30/20 నిష్ఫత్తిలో విభజించుకోవాలి. 50 శాతం ఆదాయాన్ని మీ అవసరమైన ఖర్చులకు, 30 శాతం ఆదాయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, 20 శాతం ఆదాయాన్ని పొదుపుల కోసం కేటాయించుకోండి. ఇంటి బయట టీ, కాఫీలు, టిఫిన్లు లాంటివి తగ్గించడం మంచిది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, ఆన్‌లైన్ డెలివరీ సేవలు మీ ఖర్చులను అనవసరంగా పెంచుతాయి. కనుక అవసరమైనంత వరకే వాటిని వినియోగించుకోండి.
3. తెలివిగా ఖర్చు చేయండి
మీరు తెలివిగా షాపింగ్ చేయండి. కూరగాయలు, కిరాణా సామాన్లను కొనేటప్పుడు ఆ రిటైల్ స్టోర్ అందుబాటులో ఉంచిన కూపన్లు, డిస్కౌంట్లతో ప్రయోజనాన్ని పొందండి. జనరిక్ లేదా స్టోర్ బ్రాండ్ ఐటమ్స్ కొనుగోలుకు ప్రయారిటీ ఇవ్వండి. ఇవి కొంచెం తక్కువ రేట్లలో వస్తాయి. ప్రతినెలా కనీసం 30 రోజుల పాటు అనవసర ఖర్చులు అస్సలు చేయకండి. ఆ దిశగా మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి. మీ కేబుల్, ఇంటర్నెట్ బిల్స్‌లో ఏవైనా రాయితీలు లభిస్తాయా అనే దానిపై సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లతో సంప్రదింపులు జరపండి.
4. బిల్లులు, రుణాల విషయంలో బీ అలర్ట్
మీరు ఇంట్లో ఉపయోగించని ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేసి ఉంచండి. ఇంట్లో దాదాపుగా అన్నీ ఎల్‌ఈడీ లైట్లే అమర్చుకుంటే కరెంటు బిల్లు చాలా వరకు తగ్గిపోతుంది. ఇది మీకు చాలా వరకు పొదుపును అందిస్తుంది. ఇక మీకు ఉన్న వ్యక్తిగత, వాహన రుణాలను లేదా తనఖా లోన్లను అవసరమైతే రీఫైనాన్స్ చేయించుకోండి. ఇప్పుడున్న లోన్‌పై మీరు చెల్లిస్తున్న వడ్డీ కంటే తక్కువ వడ్డీభారం పడుతుందని తెలిసినప్పుడే లోన్ రీఫైనాన్స్ దిశగా నిర్ణయం తీసుకోండి. దీనిపై సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థతో చర్చలు జరపండి. వడ్డీభారం తగ్గి, ఈఎంఐ అమౌంటు తగ్గితే మీ నెలవారీ పొదుపులు పెరిగేందుకు లైన్ క్లియర్ అవుతుంది.
5. నగదుతో ఆ పేమెంట్స్
చాలా మంది బిల్ పేమెంట్స్ కోసం క్రెడిట్ కార్డులను యథేచ్ఛగా వాడేస్తుంటారు. వాస్తవానికి అది దుబారాకు దారితీసే రిస్క్ ఉంటుంది. అందుకే నగదు రూపంలోనే బిల్ పేమెంట్స్ చేసేందుకు మొగ్గుచూపండి. దీనివల్ల మీరెంత ఖర్చు చేస్తున్నారనేది మీకు మరింత కచ్చితంగా గుర్తుంటుంది. మీ పిల్లలు, కుటుంబ సభ్యుల వినోదం కోసం ప్రతి నెలా కొంత ఖర్చు చేయడంలో తప్పులేదు. అయితే ఇది మితిమీరకుండా జాగ్రత్తపడాలి. ప్రతినెలా స్థిరత్వంతో డబ్బును పొదుపు చేసుకుంటూ ముందుకు సాగండి. ఈ క్రమంలో మీ ఆర్థిక క్రమశిక్షణను తప్పకుండా మెరుగుపర్చుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే ఆర్థిక లక్ష్యాలను సాధించే స్థాయికి మీరు ఎదగగలుగుతారు.
వాట్సాప్‌లో ITR ఫైల్ చేయాలా? ఇదీ ప్రాసెస్! - How To File ITR Via WhatsApp
రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Cars Under 7 Lakh