Types Of Term Insurance : టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చాలా మంది చెబుతుంటారు. అయితే వాటిని అర్థం చేసుకోవడంలో జనం బాగా గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్లో రకరకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో మన కుటుంబ ఆర్థిక భద్రతకు సరిపోయే పాలసీ ఏది? అనే విషయం తెలుసుకోవడం కీలకం. అందుకే ఈ కథనంలో వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి వల్ల పాలసీదారులకు కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే?
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక నిర్ణీత కాలం కోసం తీసుకునే జీవిత బీమా పాలసీ. బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి, నిర్ణీత వ్యవధిలో చనిపోతే, అతడి కుటుంబీకులు బీమా పరిహారాన్ని పొందుతారు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జీవిత బీమా పాలసీ కంటే భిన్నమైంది. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే మొత్తంలో కొంత భాగాన్ని పాలసీదారుడు వెనక్కి పొందే అవకాశం ఉండదు.
లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్
Level Term Insurance : లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్‌లో అత్యంత సాధారణ రకం. ఈ పాలసీ తీసుకున్నవారు నిర్ణీత కాలవ్యవధికి ప్రీమియం సకాలంలో చెల్లించాలి. ఈ టైంలో పాలసీదారుడికి ఏదైనా జరగరానిది జరిగితే, నిర్ణీత మొత్తాన్ని అతడి కుటుంబానికి బీమా పరిహారంగా అందిస్తారు. ఈ పాలసీ ఆర్థిక స్థిరత్వం, మనశ్శాంతిని అందిస్తుంది. ఈ పాలసీలో 'లెవల్' అనే పదాన్ని 'రీపేమెంట్'కు పర్యాయ పదంగా పరిగణించవచ్చు.
ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్
Increasing Term Insurance : ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అదనపు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పాలసీ గడువు ముగిసేలోగా బీమా కవరేజీ నిర్ణీత మొత్తంలో పెరుగుతుందని ముందే హామీ ఇస్తారు. అయితే బీమా కవరేజీ ఎంతమేర పెరగాలి? అనేది పాలసీదారుడు తన ఆర్థిక అవసరాలు, నష్టాన్ని భరించే శక్తి, ద్రవ్యోల్బణం రేటును బట్టి నిర్ణయించుకోవచ్చు.
డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్
Decreasing Term Insurance : డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కొంత చౌకైనది. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ఇది చౌకే. ఈ పాలసీ తీసుకుంటే మనకు లభించే బీమా కవరేజీ విలువ ప్రతి ఏటా క్రమంగా తగ్గుతూపోతుంది. అందుకు తగ్గట్టే, మనం పాలసీ కోసం చెల్లించే మొత్తం కూడా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మనపై ఆర్థికభారం తగ్గాలని భావిస్తే, ఈ రకం పాలసీలు బెస్ట్. అప్పులు, ఇతర ఆర్థిక బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారికి ఈ పాలసీ ఉపయోగకరం.
ప్రీమియం రిటర్న్‌తో టర్మ్ ఇన్సూరెన్స్
Term Insurance with Return of Premium (TROP) : మనం చెల్లించే పాలసీ ప్రీమియంలు తిరిగి రావాలంటే ఈ రకం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ బెస్ట్. ఇందులో బీమా కవరేజీ గడువు ముగిసే తేదీ నాటికి పాలసీదారుడు బతికి ఉంటే, అతను అప్పటివరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కు ఇస్తారు. ఇలా నిర్ణీత వ్యవధిలో బీమా పాలసీ ద్వారా ఆర్థిక వనరులు లభిస్తే కుటుంబ అవసరాలను తీర్చుకోవచ్చు. ఆ డబ్బులు వచ్చే సమయానికి వివిధ పనులను ప్లాన్ చేసుకోవచ్చు. బీమా కవరేజీతో పాటు పొదుపు చర్యలను పాటించాలని భావించే వారికి ఈ పాలసీ చక్కగా సరిపోతుంది.
కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్
Convertible Term Insurance : కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ప్రయోజనకరమైనది. దీని పేరులోనే మొత్తం అర్థం దాగి ఉంది. ఈ పాలసీని మనం నిర్ణీత గడువులోగా ఏ రూపంలోకి అయినా మార్చుకోవచ్చు. దాన్ని జీవిత బీమా పాలసీగా లేదా ఎండోమెంట్ కాంట్రాక్ట్‌గా మార్చుకోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉండేవారికి ఈ పాలసీ సరిపోతుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని మనం తీసుకుంటే, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండానే, దానిని జీవిత బీమా పాలసీగా మార్చుకోవచ్చు.
హోల్ లైఫ్ ఇన్సూరెన్స్
Whole Life Insurance : ఈ రకమైన పాలసీ తీసుకుంటే మనకు జీవితాంతం బీమా కవరేజీ లభిస్తుంది. ఇది గరిష్ఠంగా వంద సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఈ పాలసీలు చాలా ఖరీదైనవి. అత్యంత ధనికులు ఇలాంటి పాలసీలను తీసుకుంటుంటారు. ఈ పాలసీ జీవిత కాలంపాటు రక్షణ కల్పించడంతో పాటు మరణించిన తర్వాత బాధిత కుటుంబానికి బీమా పరిహారాన్ని అందిస్తుంది.