Festive home loan Bank offers : సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఈ విషయంలో అందరికీ ఎదురయ్యే మొదటి ఇబ్బంది ఆర్థిక సమస్య. దీపావళి సందర్భంగా ఇలాంటి వారి కోసం బ్యాంకులు ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకొచ్చాయి. అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీ, వడ్డీ రేటుకే గృహ రుణాలను అందిస్తున్నాయి. పరిమిత కాలవ్యవధి 20 సంవత్సరాలకు సుమారు రూ.75 లక్షల రుణాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి హోమ్ లోన్ ఇస్తున్న ఆ బ్యాంకులేవి? ఎంత మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు :
20 సంవత్సరాల కాలవ్యవధికి తక్కువ వడ్డీ రేటుతో రూ.75 లక్షలు అందిస్తున్న టాప్ బ్యాంకులు
బ్యాంకు | వడ్డీ రేటు(%) | ఈఎంఐ |
---|---|---|
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 8.35 | రూ.64,376 |
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 8.4 | రూ.64,613 |
యూసీఓ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 8.45 | రూ.64,850 |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ఎస్బీసీ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ | 8.5 | రూ.65,087 |
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ | 8.6 | రూ.65,562 |
సౌత్ ఇండియన్ బ్యాంక్ | 8.7 | రూ.66,039 |
ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి
అయితే దీపావళి సందర్భంగా అందిస్తున్న లోన్ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వయసు, ఆదాయం ఆధారంగా ఈఎంఐ కాల వ్యవధిని నిర్ణయిస్తాయి. కానీ పండుగ సందర్భంగా పరిమిత కాలవ్యవధికే రుణాలు అందిస్తున్నాయి. అందుకే రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు పాలసీలను, రుణ నిబంధనలను గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ముందస్తు చెల్లింపులు, జఫ్తుపై బ్యాంకు పాలసీలను సరిచూసుకోవాలి. కొన్ని బ్యాంకులు ముందస్తుగా రుణాన్ని చెల్లించేటప్పుడు విధించే జరిమానాలు వంటి వాటి గురించి కూడా తెలుసుకోవాలి.
ఇక రుణ విషయంలో దరఖాస్తును పూర్తి చేయడం, ఆమోదించడం లాంటి ప్రక్రియలు మొదటి దశ మాత్రమే. రుణం మంజూరు అయిన తర్వాత బ్యాంకుతో 20 ఏళ్ల పాటు సరైన సంబంధాలు కలిగి ఉండాలి. అందుకే రుణ ఆమోద ప్రక్రియ నుంచి రుణం తీరే వరకు బ్యాంకు అందించే మంచి కస్టమర్ సర్వీస్ చాలా కీలకం. బ్యాంకు సేవల నాణ్యత, ప్రతిస్పందన, వినియోగదారుడికి చాలా అవసరం. వినియోగదారులకు మేలైన సేవలు అందించే, వేగంగా స్పందించే సాంకేతికత గల బ్యాంకును రుణానికి ఎంచుకోవడం చాలా ముఖ్యం.